Samantha: ఉత్తర అమెరికా వేదికగా జరుగుతున్న తెలుగు వాళ్ల పండుగ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వేడుకల్లో స్టార్ హీరోయిన్ సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్టేజ్‌పై తన అభిమానులను ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడారు. అయితే తనపై వాళ్లు చూపిస్తున్న ప్రేమకి భావోద్వేగానికి గురయ్యారు. తానా వేడుకల్లో నటి సమంత ఈ విధంగా మాట్లాడారు.
“అమెరికాలోని తెలుగు వాళ్ల అధ్వర్యంలో తానా వేడుకలు జరగడం సంతోషం. ఈ వేడుకల్లో పాల్గొనడానికి నాకు 15 ఏళ్లు పట్టిందంటే నమ్మలేకపోతున్నా. ప్రతి ఏడాది తానా సభల గురించి, ఇక్కడున్న తెలుగువాళ్ల గురించి వింటూనే ఉంటాను. నా మొదటి చిత్రం నుండే నన్ను మీ మనిషిలా భావించారు. నాపై మీ విలువైన ప్రేమను చూపించారు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెప్పడానికి నాకు ఇన్ని ఏళ్లు పట్టింది” అంటూ శిరస్సు వంచి నమస్కారం చేశారు హీరోయిన్ సమంత.
“ప్రస్తుతం కెరీర్ పరంగా అతి ముఖ్యమైన దశలో ఉన్నాను. ట్రాలాలా పేరుతో సినీ నిర్మాణ సంస్థను ప్రారంభించాను. నిర్మాతగా ‘శుభం’ సినిమాతో తొలి అడుగు వేశాను. ఉత్తర అమెరికాకు చెందిన తెలుగువారు మా చిత్రాన్ని ఎంతగానో ఆదరించారు. నా జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ తప్పు చేసినా.. ఎప్పుడూ మీరంతా నా వెంటే ఉన్నారు. అందుకు నేనెంతో గర్వపడుతున్నా. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా, ఏ పరిశ్రమలో పనిచేసినా.. “తెలుగు అభిమానులు నన్ను చూసి గర్వపడతారా? లేదా?” అనే ఎప్పుడూ ఆలోచిస్తాను. ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో నాకు సపోర్ట్‌గా నిలిచినందుకు ధన్యవాదాలు. మీరు నాకొక గుర్తింపుతో పాటు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. ‘ఓబేబీ’ మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరడం మీవల్లే ఇది సాధ్యమైంది. ప్రాంతాన్ని బట్టి మీరు నాకు దూరంగా ఉండొచ్చు.. కానీ మీరెప్పటికీ నా మనసులోనే ఉంటారు” అంటూ హీరోయిన్ భావోద్వేగానికి గురయ్యారు. స్టేజ్ పై మాట్లాడుతూనే కన్నీళ్లు పెట్టుకున్నారు.