Telugu Film Employees Federation: సినీ కార్మికలు సమ్మె వివాదం రోజురోజుకు జఠిలమవుతోంది. సోమవారం నుంచి టాలీవుడ్‌లో షూటింగ్‌లు మొత్తం ఆగిపోయాయి. తమకు 30 శాతం వేతనాలు పెంచాలంటూ గత కొద్ది రోజులుగా తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. సినీ కార్మికుల డిమాండ్స్ విషయమై నిర్మాతలకు ఫెడరేషన్ నాయకులకు మధ్య వారం రోజులుగా జరుగుతున్న చర్చలు విఫలమయ్యాయి. వేతనాలు పెంచేందుకు నిర్మాతలకు అంగీకరించకపోవడంతో సినిమా షూటింగ్‌లను పూర్తి స్థాయిలో నిలిపివేయాలని ఫెడరేషన్ వర్గాలు పిలుపునిచ్చాయి. తమ సమస్యలకు పరిష్కారం లభించేవరకు షూటింగ్‌లలో పాల్గొనేది లేదని ఫిలిం ఫెడరేషన్ వర్గాలు తీర్మానించాయి.
కోట్లలో నష్టం…
ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయంతో చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల మూవీస్ షూటింగ్‌లు సైతం ఎక్కడికక్కడ ఆగిపోనున్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రామ్‌చరణ్ సహా పలువురు అగ్ర హీరోల సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. కార్మికుల సమ్మెతో వీరి సినిమాల షూటింగ్‌లకు బ్రేక్ పడినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఈ బంద్ కారణంగా టాలీవుడ్‌కు కోట్లలో నష్టం వాటిల్లుతుందని నిర్మాతలు అంటున్నారు.
Also Read – AP Free Bus :ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మార్గదర్శకాలు ఇవే!
వారికి మినహాయింపు…
ఎవరైతే 30 శాతం వేతనాల ఇస్తున్నారో ఆ నిర్మాతల షూటింగ్‌లకు మాత్రం ఎలాంటి అడ్డంకులు ఉండవని ఫిలిం ఫెడరేషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఆ నిర్మాతలకు ఫెడరేషన్ ఫుల్ సపోర్ట్ ఇస్తుందని, వారి షూటింగ్‌లను పూర్తిచేయడానికి అన్ని విధాలుగా సహకరిస్తామని అన్నారు. 30 శాతం వేతనాలు ఇస్తున్న వారి సినిమాల్లో తప్ప మిగిలిన ప్రొడ్యూసర్ల సినిమాల షూటింగ్‌లలో మాత్రం కార్మికులు పాల్గొనరని ఫెడరేషన్ వర్గాలు పేర్కొన్నాయి.
తెలుగు ఇండస్ట్రీలోనే ఎక్కువ…
ఇతర సినిమా ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగులోనే కార్మికులకు ఎక్కువగా వేతనాలు ఉన్నాయని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. మూడేళ్ల నుంచి తమకు అసలు వేతనాలే పెంచలేదని కార్మికులు చెబుతోన్నారు. ఈ వివాదానికి సంబంధించి చిరంజీవి, బాలకృష్ణలతో అటు నిర్మాతలు, ఇటు ఫెడరేషన్ వర్గాలు సమావేశాలు జరిపాయి. అయినా వివాదం మాత్రం కొలిక్కి రాలేదు. అవసరమైతే తమ సమస్యల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని నిర్మాతలకు కార్మికులు వార్నింగ్ ఇచ్చారు.
ఏపీకి చేరిన సమస్య…
సినీ కార్మికలు బంద్ సమస్య ఏపీకి చేరింది. గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో జరుగుతున్న పరిణామాలపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌తో సోమవారం తెలుగు సినిమా నిర్మాతలు భేటీ అయ్యారు. సినీ కార్మికుల సమ్మె ప్రధానంగా ఈ మీటింగ్ జరుగుతోందని అంటున్నారు. ఈ సమావేశంలో టాలీవుడ్ నుంచి డీవీవీ దానయ్య, బీవీఎస్ఎన్ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ, బన్నీవాస్, వివేక్ కూచిభొట్ల, సాహు గారపాటి, కేఎల్ నారాయణ, యెర్నేని రవిశంకర్‌తో పాటు మరికొందరు నిర్మాతలు పాల్గొన్నారు.
Also Read – Weight Loss: బరువు తగ్గాలనుకునేవారికి రెండిటిలో ఏది బెస్ట్..జొన్న రోటీనా ..రాగి రోటీనా..!


