ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి(Telugu Film Producers Council) స్పందించింది. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కొత్త విధానం తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపింది. ఈమేరకు సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan kalyan) , మంత్రులు లోకేష్, కందుల దుర్గేష్‌కు కృతజ్ఞతలు చెప్పింది. విశాఖ, తిరుపతి, రాజమండ్రిలో స్టూడియోలు నిర్మించాలని కోరామని పేర్కొంది. దర్శకులు, కళాకారులు, సాంకేతిక సిబ్బందికి ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరామని చెప్పుకొచ్చింది. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. అలాగే నంది అవార్డులను సైతం పునరుద్ధరించాలని కోరింది.
కాగా ఏపీకి సినీ పరిశ్రమ రాకపై గురువారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త పాలసీని తీసుకొస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అద్భుతమైన లొకేషన్‌లు ఉన్నాయని.. స్టూడియోలు నిర్వహించడానికి ముందుకు వస్తే వారికి ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.