సినిమా రివ్యూ: తమ్ముడు
నటీనటులు: నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వస్తిక విజయ్, సౌరబ్ సచ్ దేవ్ తదితరులు
సినిమాటోగ్రాఫర్స్: సమీర్ రెడ్డి, కె.వి గుహన్, సత్యజిత్ పాండే
ఎడిటర్: ప్రవీణ్ పూడి
సంగీతం: అజినీష్ లోక్‌నాథ్
నిర్మాత: శిరీష్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వేణు శ్రీరామ్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కించిన సినిమా ‘తమ్ముడు’. ‘వకీల్ సాబ్’ తర్వాత వేణు తెరకెక్కించిన సినిమా కావడం వల్ల అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన తమ్ముడు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకున్నారు అనేది ఫుల్ రివ్యూలో చూద్దాం..
కథ:
జై (నితిన్) విలువిద్య ఆటగాడు (ఆర్చర్).. చిన్నప్పటి నుంచి కష్టపడి విలువిద్యలో శిక్షణ తీసుకుంటాడు. ఎలాగైనా దేశానికి బంగారం పతకం (గోల్డ్ మెడల్) సాధించాలి అనేది జై కల. కానీ ‘బుల్స్ ఐ’ కొట్టడంలో ప్రతిసారి మిస్ అవుతూ ఉంటాడు. అతని మదిలో ఉన్న కొన్ని కారణాల వల్లే అలా జరుగుతుందని తెలుస్తుంది. దీంతో ఆ సమస్యలకు పరిష్కారం వెతికి ఆ తర్వాత విలువిద్య సాధన చేయమని జై కోచ్ చెప్తాడు.
కోచ్ చెప్పిన మాటలు విన్న తర్వాత.. సమస్య పరిష్కారం కోసం బయలుదేరుతాడు మన హీరో జై. అలా తన అక్క ఝాన్సీ (లయ)కు చిన్ననాట చేసిన అన్యాయం అతనికి గుర్తుకొస్తుంది. దాంతో అక్క దగ్గరికి వెళ్తాడు తమ్ముడు. అతను వెళ్లేసరికి అక్క కుటుంబం ప్రమాదంలో ఉందని హీరోకి తెలుస్తుంది. ఆమె ఇచ్చిన మాట కోసం ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా తమ్ముడు ఏం చేశాడు అనేది మిగిలిన కథ..
కథనం:
అక్కకి ఇచ్చిన మాట కోసం తమ్ముడు ఓ ఊరికి వెళ్లి ఏం చేశాడు అనేది ఈ సినిమా అసలు కథ. “మనిషిపోయి మాట బతికితే మనిషి బతికినట్టే.. అదే మాట పోయి మనిషి బతికినా కూడా మనిషి పోయినట్టే” అనేది ఈ సినిమాకి కీ లైన్. సింపుల్‌గా మూడే ముక్కల్లో చెప్పాలంటే ఒక నిజాయితీ కలిగిన గవర్నమెంట్ ఉద్యోగితో తప్పుడు సంతకాల కోసం విలన్ ఆడే డ్రామానే ఈ సినిమా. నిజాయితీ ఆఫీసర్ తమ్ముడే హీరో జై. అక్కకు ఇచ్చిన మాట కోసం తమ్ముడు ఏం చేశాడు అనేది సినిమా కథ వినడానికి చాలా సింపుల్‌గా అనిపించినా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాలి అనుకున్నాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్. కానీ అదే బెడిసికొట్టింది. తాను గతంలో చేసిన సినిమాలలో కమర్షియల్ అంశాలు ఎక్కువగా చూపించిన వేణు.. తమ్ముడులో టెక్నికల్ అంశాలపై మెయిన్ ఫోకస్ చేశాడు.
మ్యూజిక్ పరంగా ఈ సినిమా బాగుంది. నిర్మాత దిల్ రాజు చెప్పినట్టుగా.. సినిమాలో మొదటి 15 నిమిషాల తర్వాత సినిమా మొత్తం ఒకే రోజులో జరిగే కథ. ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే చాలా పకడ్బందీగా ఉండాలి. కానీ ఆ విషయంలోనే డైరెక్టర్ వేణు శ్రీరామ్ పూర్తిగా మిస్ ఫైర్ చేశాడు. హీరో అక్క అనుకోకుండా ఓ ఊరికి వెళ్లడం.. అక్కడ ఆమె కొన్ని సమస్యల బారిన పడడం.. ప్రజలకు ఇచ్చిన మాట తీర్చకుండా ఉండడం.. ఇదంతా తెలుసుకున్న తమ్ముడు.. తన అక్క మాట కోసం అదే ఊరికి వచ్చి ఆమె మాటలను ఎలా నిజం చేశాడు.. ఇవన్నీ చాలా సినిమాలలో చూసిన విషయాలు. ఇందులో ఒక డైలాగు ఉంటుంది “అనుగక్షతి ప్రవాహా” అని.. అంటే ఇంగ్లీష్‌లో “గో విత్ ద ఫ్లో” (Go with The Flow) అని అర్థం. దారి ఎటు చూపిస్తే అటు వెళ్లిపో అని దాని అర్థం. ఈ కథ, కథనాలు కూడా అలాగే వెళ్ళిపోయాయి.
నటీనటులు:
హీరో నితిన్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్ర ఇచ్చినా తన శక్తి వంచన లేకుండా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాడు. కొన్నిసార్లు విజయవంతం అయ్యాడు కూడా. అయితే ఈ మధ్య ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకులు అనుకున్నంత మేర ఆకట్టుకోవడం లేదు. ఈ మూవీలో హీరో తర్వాత అత్యంత కీలకమైన పాత్ర లయ పోషించింది. అక్క పాత్రలో ఆమె జీవించేసింది. మరో చిన్న పాప పాత్ర కూడా చాలా బాగుంది. ఇక హీరోయిన్స్ వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ తమ పాత్రలకు న్యాయం చేశారు. లేడీ విలన్‌గా స్వస్తిక విజయ్ బాగా నటించింది. మరో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సౌరబ్ సచ్ దేవ్ అద్భుతమైన నటన కనబరిచాడు. మిగిలిన వాళ్ళందరూ తమ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఇతర అంశాలు:
ఈ సినిమాకు ప్రధానమైన బలం బ్యాగ్రౌండ్ మ్యూజిక్. సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ ఈ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ చిత్రంలో పాటల కంటే బ్యాగ్రౌండ్ స్కోరు విషయంలో అజినిష్ ఎక్కువగా ఆకట్టుకున్నాడు. ఛాయచిత్ర గ్రాహకుడి పనితీరు కూడా అద్భుతంగా ఉంది. సినిమాలో అధిక భాగం సినిమా అడవిలోనే సాగుతుంది. మారేడుమిల్లి అడవుల అందాలను చాలా బాగా చూపించాడు సినిమాటోగ్రాఫర్స్ సమీర్ రెడ్డి, కె.వి గుహన్, సత్యజిత్ పాండే. ఎడిటర్ ప్రవీణ్ పూడి ఇంకాస్త తన కత్తెరకు పని చెప్పిఉంటే బాగుండు అనిపించింది. నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. దర్శకుడు వేణు శ్రీరామ్ కథ మాత్రమే కాదు.. స్క్రీన్ ప్లే కూడా పాతదే వండి వడ్డించినట్లు అనిపిస్తుంది.
గమనిక:
ఈ సినిమా రివ్యూ పూర్తిగా ఎడిటర్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.