Pawan Kalyan Movie Titles: టాలీవుడ్ హీరోల్లో పవన్ కళ్యాణ్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్‌లో నితిన్ ఒకరు. పవన్‌పై తనకున్న అభిమానాన్ని ప్రతి సినిమాలో ఏదో ఒక రూపంలో చూపిస్తూనే ఉంటాడు నితిన్. తన లేటెస్ట్ మూవీ తమ్ముడుతో కూడా తాను పవన్ వీరాభిమానిని అని మరోసారి చాటిచెప్పాడు నితిన్. ఈ సారి ఏకంగా పవన్ కళ్యాణ్ టైటిల్‌తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమ్ముడు కంటే ముందు పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్‌తో కొందరు హీరోలు సినిమాలు చేశారు. కానీ ఈ టైటిల్స్.. మెగా హీరో వరుణ్‌తేజ్‌కు తప్ప మిగిలిన హీరోలకు అంతగా కలిసిరాలేదు.
75 కోట్ల బడ్జెట్…
పవన్ కళ్యాణ్ కెరీర్‌లో సూపర్ హిట్ మూవీగా నిలిచిన చిత్రం ‘తమ్ముడు’. ఈ టైటిల్‌తో నితిన్ చేసిన ఈ మూవీ జూలై 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్కాతమ్ముళ్ల అనుబంధానికి యాక్షన్, ఫాంటసీ అంశాలు జోడించి రూపొందిన ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కాంతార ఫేమ్ సప్తమి గౌడతో పాటు లయ, వర్షబొల్లమ్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు 75 కోట్ల బడ్జెట్‌తో నితిన్ కెరీర్‌లో భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా తమ్ముడు రూపొందుతోంది. భీష్మ తర్వాత నితిన్‌కు సరైన విజయాలు లేవు. వరుస డిజాస్టర్స్‌తో సతమతమవుతున్న నితిన్‌ను పవన్ టైటిల్‌తో వస్తున్న తమ్ముడు గట్టెక్కిస్తుందో లేదో మరో రెండు రోజుల్లో తేలనుంది.
తొలి ప్రేమ…
తమ్ముడు కంటే ముందు పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్ మూవీ తొలి ప్రేమ టైటిల్‌తో మెగా హీరో వరుణ్‌తేజ్ ఓ సినిమా చేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్ డ్రామా మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. వరుణ్ తేజ్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.
ఖుషి.. మ్యాజిక్ రిపీట్ కాలేదు
పవన్ కళ్యాణ్‌కు స్టార్ ఇమేజ్‌ను తీసుకొచ్చిన సినిమాల్లో ఖుషి ఒకటి. ఎస్‌జే సూర్య డైరెక్షన్‌లో రూపొందిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఖుషి టైటిల్‌తో విజయ్ దేవరకొండ, సమంత ఓ సినిమా చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఆ మ్యాజిక్‌ను మాత్రం రిపీట్ చేయలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి…
పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి టైటిల్ క్రేజ్‌ను వాడుకుంటూ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా హిట్టు అందుకోవాలని అనుకున్నాడు. అతడి ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. జబర్ధస్థ్ మేకర్స్ నితిన్, భరత్ దర్శకత్వంలో కామెడీ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ కామెడీ ఆశించిన స్థాయిలో లేకపోవడంలో సినిమా డిజాస్టర్‌గా మిగిలింది.