International Day Against Drug Abuse: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘రైజింగ్ తెలంగాణ’ అనే అద్భుతమైన అవగాహన కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), ఎప్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) పాల్గొని యువతకు, తల్లిదండ్రులకు ఆకట్టుకునే సందేశం ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసిన దిల్ రాజు, డ్రగ్స్ మహమ్మారిని తెలంగాణ రాష్ట్రంలో నిర్మూలించాలని అందుకోసం ప్రజలందరూ సైనికుల్లా ముందుకు రావాలని అన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నేషనల్ డే ఎగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ కార్యక్రమానికి హాజరైన నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘నేను, ముఖ్యమంత్రి రేవంత్ (CM Revanth Reddy) గారు దాదాపు 9 నెలల ముందు వైజాగ్ నుండి హైదరాబాద్ వరకు జర్నీ చేశాం. ఈ జర్నీలో తెలంగాణలో డ్రగ్స్ లేకుండా చేయాలని సీఎం రేవంత్ రెడ్డిగారు చెప్పారు. చిన్న పిల్లల వరకు డ్రగ్స్ వ్యాప్తి చెందడం భవిష్యత్తుకు ఎంత ప్రమాదకరమో, దీని నిర్మూలనకు అందరూ కంకణం కట్టుకోవాల్సిన అవసరాన్ని ఇదే సీఎం నొక్కిచెప్పారని ఆయన పేర్కొన్నారు. ‘‘నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, నాకు తెలిసిన వారెవరూ కానీ డ్రగ్స్ తీసుకోకుండా నేను చేయగలుగుతాను’’ అని ప్రతిజ్ఞ చేస్తున్నానని దిల్ రాజు అన్నారు. ప్రజలందరూ కూడా ఇలాంటి ప్రతిజ్ఞ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు, తద్వారా ప్రతి కుటుంబం, మొత్తం తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ రహితంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/legendary-singer-k-s-chitra-shares-about-her-shoulder-injury/
సినిమా పరిశ్రమ (Tollywood) గురించి మాట్లాడుతూ ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమ డ్రగ్స్ తీసుకున్న వారిని బహిష్కరించే నిర్ణయం తీసుకుందని దిల్ రాజు వెల్లడించారు. అదే స్ఫూర్తితో, తెలంగాణ FDC (ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా డ్రగ్స్ తీసుకునే వారిని నిషేధించాలని ఆయన కోరారు. ఇలా చేయడం వల్ల సమాజానికి సినిమా పరిశ్రమ నుంచి ఒక గట్టి సందేశం వెళ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగారి ఆశిస్తున్నట్లుగా మన రాష్ట్రం డ్రగ్స్ లేని రాష్ట్రంగా మారాలంటే మనమే బాధ్యత తీసుకోవాలి. అలాంటి సమాజ స్థాపన మనందరి కర్తవ్యం, దీని కోసం అందరూ ప్రతిన తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని దిల్ రాజు నొక్కి చెప్పారు. ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరముందని దిల్ రాజు తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రముఖులతో మంచి సంబంధాలున్న వ్యక్తి దిల్ రాజు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే దిల్ రాజుని ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా (FDC Chairman)నియమించిన సంగతి తెలిసిందే.