Ravi Teja Father No More: ప్రముఖ నటుడు రవితేజ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు (90) కన్నుమూశారు. ఈ ఘటన మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో చోటుచేసుకుంది. ఈ హఠాన్మరణ వార్త సినీ పరిశ్రమను, రవితేజ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు రాజగోపాల్ రాజు గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, రవితేజ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
రాజగోపాల్ రాజు మృతి వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ అగ్ర నటుడు చిరంజీవి తన సంతాపాన్ని ప్రకటించారు. “సోదరుడు రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు మరణవార్త విని చాలా బాధపడ్డాను” అని చిరంజీవి పేర్కొన్నారు. “ఆయన్ని చివరిసారిగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సెట్లో కలిశాను” అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో రవితేజ కుటుంబానికి తన హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తూ, మరణించిన రాజగోపాల్ రాజు గారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చిరంజీవి వెల్లడించారు.
రాజగోపాల్ రాజుకి ముగ్గురు కుమారులు కాగా, వారిలో రవితేజ పెద్ద కుమారుడు. రవితేజ సోదరులలో ఒకరైన భరత్, 2017లో జరిగిన ఒక కారు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించారు. మరో కుమారుడు రఘు కూడా సినీ రంగంలో నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. రాజగోపాల్ రాజు తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. ఆయన వృత్తిరీత్యా ఫార్మాసిస్ట్‌గా పనిచేశారు. ఉద్యోగ కారణాల వల్ల ఆయన తన జీవితంలో ఎక్కువ భాగం ఉత్తర భారతదేశంలోనే గడిపారు. రవితేజ కూడా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందు, తన తండ్రితో పాటుగా జైపుర్, ఢిల్లీ, ముంబయి వంటి వివిధ నగరాల్లో నివసించారు.

