Fish Venkat Health Condition: టాలీవుడ్ కమెడియన్ ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కిడ్నీ సంబంధిత సమస్యలతో చాలా కాలంగా బాధపడుతోన్నారు ఫిష్ వెంకట్. ఆయన రెండు కిడ్నీలు పాడవ్వడంతో గత వారం రోజులుగా నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫిష్ వెంకట్‌కు వెంటిలేటర్‌పై డాక్టర్లు ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు ఫిష్ వెంకట్ ట్రీట్‌మెంట్ కోసం ఆర్థిక సాయాన్ని అందించాలని దాతలను కుటుంబసభ్యులు కోరుతున్నారు. డయాలసిస్‌తో పాటు కిడ్నీ ట్రాన్స్‌ఫ్లాంటేషన్ అవసరమని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం.
తెలంగాణ యాస…
తెలంగాణ యాసతో కూడిన డైలాగ్ డెలివరీతో టాలీవుడ్‌లో కమెడియన్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు ఫిష్ వెంకట్. సుదీర్ఘ సినీ ప్రయాణంలో విలన్ అసిస్టెంట్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించాడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన సమ్మక సారక్క మూవీతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఫిష్ వెంకట్. ఎన్టీఆర్ ఆది మూవీలో తొడకొట్టు చిన్నా అనే డైలాగ్‌తో పాపులర్ అయ్యాడు. కింగ్, డాన్ శీను, రచ్చ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఖైదీ నంబర్ 150తో పాటు పలు సినిమాలు ఫిష్ వెంకట్‌కు కమెడియన్‌గా మంచి పేరు తెచ్చిపెట్టాయి.
స్టార్ హీరోలందరితో..
చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ఎన్టీఆర్‌తో పాటు స్టార్ హీరోలందరితో సినిమాలు చేశాడు ఫిష్ వెంకట్. 25 ఏళ్ల సినీ ప్రయాణంలో వందకు పైగా సినిమాల్లో నటించాడు ఫిష్ వెంకట్. అనారోగ్య సమస్యల వల్ల గత రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఫిష్ వెంకట్ కుటుంబం చేపలు అమ్మే వృత్తిలో ఉంది. వృత్తినే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు.