కొన్ని రోజులుగా దేశమంతా అల్లు అర్జున్(Allu Arjun) టాపిక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బన్నీ గురించే చర్చ జరుగుతోంది. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు అల్లు అర్జున్ గురించే రచ్చ నడుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి బన్నీ తప్పు ఉందంటూ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వ పెద్దలు విమర్శలు చేస్తుంటే.. ప్రభుత్వం వైఫల్యం ఉందంటూ ఆయన ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
‘‘ఇటీవల జరిగిన సంఘటనపై నాకు చాలా తప్పుడు సమాచారం అందింది. అందుకే నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను’’ అని పోస్టులో రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా అంతకుముందు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో బన్నీకి సపోర్ట్‌గా ట్వీట్ చేశారు రాహుల్. ప్రభుత్వ వైఫల్యానికి ఓ వ్యక్తి ఎలా కారణం అవుతారంటూ ప్రశ్నించారు. తాజాగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, పోలీసులు విడుదల చేసిన వీడియోలు తర్వాత అల్లు అర్జున్ మద్దతుగా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.