ఫిబ్రవరి 26న మహా శివరాత్రి వేడుకలకు ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తి ముస్తాబవుతోంది. శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయంలో ఈ నెల 21 నుంచి మార్చి 6 వరకు బ్రహ్మోత్సవాలు(Srikalahasti Brahmotsavams) ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా స్వయంగా ప్రముఖులను కలిసి ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నారు.
రాజకీయ ప్రముఖులతో పాటు సినీ హీరోలను కూడా కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, నితిన్ వంటి స్టార్ హీరోలను వ్యక్తిగతంగా కలిసి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ వంటి వారిని కూడా ఆహ్వానించారు.



