Tollywood Movies: 2025లో ఫస్ట్ హాఫ్ ముగిసింది. ఆరు నెలల్లో టాలీవుడ్‌కు ఆశాజనకమైన ఫలితాలు మాత్రం దక్కలేదు. జనవరి నుంచి జూన్ నెలాఖరు వరకు ఈ ఆరు నెలల్లో తొంభై వరకు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో పట్టు మని పది సినిమాలు కూడా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టలేకపోయాయి. నెలకో హిట్ చొప్పన మొత్తం ఈ ఆరు నెలల్లో ఎనిమిది సినిమాలు మాత్రమే బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి.
సంక్రాంతికి మూడు సినిమాలు…
ఈ ఏడాది సంక్రాంతికి రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్‌తో పాటు బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ మూడింటిలో గేమ్ ఛేంజర్ అల్ట్రా డిజాస్టర్‌గా నిలవగా…బాలకృష్ణ డాకు మహారాజ్ థియేట్రికల్ రన్‌లో మాత్రం నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టింది. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ హక్కులతో నిర్మాతలు గట్టెక్కారు. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం వస్తున్నాం మాత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ మూడు వందల కోట్లకుపైగా కలెక్షన్స్ సొంతం చేసుకున్నది…
నాని రెండు హిట్లు…
2025 నానికి బాగా కలిసివచ్చింది. హీరోగా హిట్ 3, నిర్మాతగా కోర్ట్‌తో రెండు విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ 3 మూవీ వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టగా…కోర్ట్ మూవీ చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌గా నిలిచింది. కేవలం పది కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన కోర్ట్ ఏకంగా యాభై కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది.
తండేల్ – కుబేర…
అక్కినేని హీరోలు 2025 ఫస్ట్ హాఫ్‌లో అదరగొట్టారు. నాగచైతన్య తండేల్, నాగార్జున కుబేర సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన తండేల్ నాగచైతన్య కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది.
ధనుష్ హీరోగా నటించిన కుబేరలో మంచి సినిమాగా ప్రేక్షకుల మన్ననలను అందుకుంటోంది. ఈ సినిమాలో నెగెటివ్‌గా కనిపించే పాజిటివ్ షేడ్ క్యారెక్టర్‌లో నాగార్జున కనిపించారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందిన బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/ramayana-movie-title-controversy/
కామెడీతో హిట్స్…
శ్రీవిష్ణు సింగిల్, ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ మ్యాడ్ స్క్వేర్ సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచి నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. లాజిక్‌లతో పని లేకుండా కామెడీ తెరకెక్కిన ఈ సినిమాలు ఆడియెన్స్‌ను అలరించాయి. శుభం సినిమాతో నిర్మాతగా తొలి అడుగులోనే హిట్టు అందుకున్నది సమంత. కాన్సెప్ట్, కామెడీ విషయంలో విమర్శలు వచ్చినా…లో బడ్జెట్ మూవీ కావడంతో థియేట్రికల్‌తో పాటు ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా సమంతకు గట్టిగానే మిగిలినట్లు చెబుతోన్నారు.