- ‘దొంగ నా కొడుకు’ చిత్రం హీరోయిన్ సుష్మితా శెట్టి
‘దొంగ నా కొడుకు’ చిత్రంలో క్యూట్ అండ్ బబ్లీ క్యారెక్టర్ చేశానని ఆ చిత్ర హీరోయిన్ సుష్మితా శెట్టి స్పష్టంచేశారు. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా, శ్రీను కంబాల దర్శకత్వంలో పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 13న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం నాడు హీరోయిన్ సుష్మితా శెట్టి హైదరాబాద్ లో పాత్రికేయులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఆ వివరాలేమిటో ఆమె మాటల్లో… “అందరూ రిలేట్ చేసుకునే ఫన్ టైటిల్ ఇది. అలాగే కథ వినగానే చాలా నచ్చింది. మంచి వినోదాత్మక చిత్రమిది. ఇందులో కొంచెం తింగరితనంగా మెలుగుతూ చాలా స్మార్ట్ అనుకునే అమ్మాయి క్యారెక్టర్ ను నేను పోషించాను. ఈశ్వర్ (హీరో మౌళి)ని గాఢంగా ప్రేమించే అమ్మాయిగా… ప్రేమ కోసం ఏదైనా చేసేవిధంగా నా పాత్ర మలచబడింది. ఇంకా చెప్పాలంటే క్రైమ్‌లో తెలియకుండానే ఇన్నోసెంట్‌గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను. నేను ఏదైనా స్మార్ట్‌గా చేయాలనుకుంటే అది కామెడీ అయిపోతుంటుంది. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు నవ్వుకుంటూ థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఇక లీడ్ హీరోయిన్గా ‘దొంగ నా కొడుకు’ నా మొదటి సినిమా. ఇంతకుముందు ‘జగమే సంగీతం’ అనే వెబ్ సిరీస్ చేశాను. ఒక నటిగా బిగ్ స్క్రీన్ పై చూసుకోవడానికి చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది.
‘మహానటి’ లాంటి ఎమోషన్స్ ఉన్న సినిమా చేయాలనుంది..
‘మహానటి’ నా ఫేవరేట్ సినిమా. నాకు కూడా అలాంటి అన్నిరకాల ఎమోషన్స్ ఉన్న ఒక సినిమా చేయాలని ఉంది. అలాగే స్పోర్ట్స్ సినిమాలు కూడా చేయాలని ఉంది. నాకు రొమాంటిక్ కామెడీ అంటే చాలా ఇష్టం. అలాగే హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్‌ను కూడా ఇష్టపడతాను. నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. కాకపోతే మా గ్రాండ్ పేరెంట్స్ కన్నడ నుంచి 40 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చారు. నాకు శ్రీదేవి స్ఫూర్తి. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ పట్ల నాకు అమితాసక్తి ఏర్పడింది. అన్ని రకాల డ్యాన్స్‌లు నేర్చుకున్నాను. డ్యాన్స్ చేసేటప్పుడు చాలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా నాకు నటనపై ఆసక్తి ఏర్పడింది. నేను ఫారిన్లో చదువుకున్నాను. అక్కడ చదువుకునేటప్పుడు థియేటర్ కూడా చేశాను. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

