ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ఈ చిత్రానికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేం పి. మహేష్ దర్శకుడు. టైటిల్ అండ్ పోస్టర్, టీజర్‌తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం మైత్రీవారు ఎక్కువ బడ్జెట్‌నే కేటాయించారు. ఇందులో రామ్ హీరో అభిమానిగా కనిపించబోతున్నారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరుగుతోంది.
షూటింగ్ కోసం రాజమండ్రికి వెళ్ళిన రామ్‌కి ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్ అయిన షెరటాన్లో బస ఏర్పాటు చేశారు. అదే హోటల్‌లో అనుకోని సంఘటన జరిగింది. సోమవారం రాత్రి ఆయన బస చేసిన హోటల్ గదిలోకి ఇద్దరు అనుమానితులు ప్రవేశించారు. ప్రస్తుతం మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంఘటనతో యూనిట్ సభ్యులు, హోటల్ సిబ్బందికి షాక్ తగిలింది.
అసలేం జరిగిందంటే, సోమవారం రాత్రి 10 గంటలకి ఇద్దరు వ్యక్తులు వచ్చి మేము హీరో టీమ్‌కి చెందిన వాళ్లమని చెప్పారట. లిఫ్ట్ యాక్సెస్ ఇవ్వమని హోటల్ సిబ్బందిని అడిగారు. వీఐపీ గెస్ట్‌గా 6వ అంతస్థులో ఉన్న రామ్ గది వరకు లిఫ్ట్ యాక్సెస్ ఇచ్చారు. అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి మాస్టర్ కీ సంపాదించి గదిలోనికి వెళ్ళారట. అప్పటికే రామ్ గాఢ నిద్రలో ఉన్నారు. తలుపు గట్టిగా కొట్టడంతో, అనుమానం వచ్చి ఆయన నిద్రలేచి చూసి వెంటనే తన టీమ్‌కు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న యూనిట్ సభ్యులు వెంటనే హోటల్ మేనేజ్‌మెంట్‌కు కూడా సమాచారం అందజేశారు.
పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆ ఇద్దరు వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కి తరలించారు. మద్యం మత్తులో ఉండే ఇలా చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సంఘటన అటు అభిమానులను, ఇటు ఇండస్ట్రీ వర్గాలను కలవరపెడుతోంది. ఈ సంఘటన తర్వాత హీరో దగ్గరికి అనుమానితులను అనుమతించడం లేదు. కాగా, ఈ ఉస్తాద్ హీరోకి ఇటీవల ఆశించిన విజయాలు దక్కడం లేదు. ఇస్మార్ట్ శంకర్‌తో భారీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చేసిన రెడ్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి.