ఇటీవల కాలంలో ఓటీటీల వాడకం ఎక్కువైపోయింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో(OTT PlatForms) చూసేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొన్ని వెబ్ సిరీస్, సినిమాల్లో బోల్డ్ కంటెంట్ ఎక్కువైపోతుంది. వీటికి ఎలాంటి సెన్సార్ లేకపోవడంతో మేకర్స్ డ్రగ్స్, బూతులు, రొమాన్స్ సీన్‌లు విపరీతంగా వాడుతున్నారు. ఇలాంటి కంటెంట్‌లపై కేంద్రానికి చాలా రోజులుగా ఫిర్యాదులు అందుతున్నాయి. తాజాగా ఈ ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ(Union Ministry of Information and Broadcasting) ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు అడ్వైజరీని జారీ చేసింది.
ఇకపై డ్రగ్స్ వినియోగాన్ని ప్రోత్సహించడం, బోల్డ్ కంటెంట్‌ను చూపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సినిమాలు, సీరియల్స్‌లో నటులు మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రోత్సహించే సన్నివేశాలను యూజర్ వార్నింగ్ లేకుండా ప్రసారం చేయకూడదని సూచించింది. ఇలాంటి కంటెంట్ ద్వారా యువత ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ సీన్స్ చూపించే సమయంలో తప్పనిసరిగా హెచ్చరికలు ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. కాగా కేంద్రం నిర్ణయంపై ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.