Ustad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీంకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 19న విడుదలకు సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. ఇందులో భాగంగా ఈ సినిమాకు స్పెషల్, బెనిఫిట్ షోలతో పాటు టికెట్ల రెట్లకు పెంపునకు అనుమతి ఇవ్వాలని మూవీ టీం ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంది.
ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రభుత్వం తెల్లవారుజామునే బెనిఫిట్ షోలు అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల రోజైన మార్చి 19న రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఒక ప్రత్యేక బెనిఫిట్ షో ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ షో తెల్లవారుజామున 4:00 గంటల నుంచి 5:00 మధ్య ప్రారంభం కానుంది. ఈ ప్రత్యేక షోకి టికెట్ ధరను గరిష్టంగా రూ. 500 (జీఎస్టీతో కలిపి) గా నిర్ణయించారు.
టికెట్ రేట్స్ ఇలా
సాధారణ ప్రేక్షకులకు కూడా అందుబాటులో ఉంటూనే టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. పెరిగిన ఈ టికెట్ ధరలు మార్చి 19 నుంచి మార్చి 28 వరకు అమల్లో ఉంటాయి. సింగిల్ స్క్రీన్ లో రూ. 100, మల్టీప్లెక్స్ లో రూ. 125 అదనంగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే ఫస్ట్ డే మార్చి 19న, బెనిఫిట్ షోతో పాటు అదనంగా మరో 5 షోలు (మొత్తం 6 షోలు) ప్రదర్శించుకునేలా మినహాయింపు ఇచ్చింది. మిగిలిన రోజుల్లో రోజుకు 5 షోల ప్రదర్శనకు అనుమతి లభించింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లకు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో ఊరట
ఇక తెలంగాణలోనూ మూవీ టీంకి భారీ ఊరట లభించింది. గతంలో టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా.. టికెట్ ధరలు పెంచాలంటే 90 రోజుల ముందుగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలనే కఠిన నిబంధనను న్యాయస్థానం విధించిన సంగతి విధితమే. హైకోర్టు తీర్పు పెద్ద సినిమాల విడుదలకు పెద్ద అడ్డంకిగా మారింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ మూవీ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. హైకోర్టు విధించిన ఆ 90 రోజుల నిబంధనపై స్టే విధించింది. గతంలో ఉన్న పాత విధానాన్నే కొనసాగించాలని సూచించడంతో తెలంగాణలోనూ టికెట్ ధరల పెంపునకు లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా మూవీ టికెట్ల రేట్ల నిర్ణయించి ప్రకటన ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.
Also Read: The Paradise: ఆయా షేర్ పాట కోసం 2.5 ఎకరాల్లో భారీ సెట్.. ఒక్క పాటకు ఇంత కష్టమా!

