Asha Bhosle Died: ప్రముఖ గాయని ఆశా భోంస్లే(92) ఇక లేరు. శనివారం సాయంత్రం గుండెపోటు, శ్వాసకోశ ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆమె కుమారుడు మరణ వార్తను అధికారికంగా ప్రకటించారు.
తెలుగులో ఆమె గాత్రం వినిపించింది చాలా తక్కువ సినిమాల్లోనే. కానీ అభిమానులు మాత్రం కొండంత. ఆమె పాడిన పాటలు ఎక్కడ వినిపించినా ఆస్వాదించకుండా ఉండలేరు. ‘నాలో ఊహలకు’ అంటూ యువ ప్రేమ జంట ప్రణయ గీతానికి తన స్వర మాధుర్యంతో ఎవర్‌గ్రీన్ అనుభూతిని అందించారు. ఆమెనే ఆశా భోంస్లే.. 1933లో మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించిన ఆశా భోంస్లే ఎన్నో వేల పాటలతో సినీ లోకాన్ని, సంగీత ప్రియులను, అభిమానులను అలరించారు. 92 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు.
శనివారం సాయంత్రం గుండెపోటు, శ్వాసకోశ ఇబ్బందులకు గురైన ఆశా భోంస్లేను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల ఈ రోజు ఆమె తుదిశ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే ఈ విషాద వార్తను అధికారికంగా ప్రకటించారు.
సోమవారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్క్లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి ఆమె నివాసం ‘కాసా గ్రాండే'(లోయర్ పరేల్) వద్ద అభిమానుల సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచనున్నారు.
- Advertisement -
Also Read: https://teluguprabha.net/top-stories/telangana-intermediate-results-released-today/
ఎనిమిది దశాబ్దాలకు పైగా సాగిన ఆశా భోంస్లే ప్రస్థానంలో 20కి పైగా భాషల్లో వేల సంఖ్యలో పాటలు పాడారు. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమకు చేసిన కృషికి గాను పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, మహారాష్ట్ర భూషణ్, బంగాబిభూషణ్ అవార్డులు ఆమెను వరించాయి. ఇక, తెలుగులో చాలా తక్కువ చిత్రాల్లో పాటలు పాడారు. ఇది మౌనగీతం, సీతాకాలం ప్రేమకు, ఐసాలకిడి, నాలో ఊహలకు వంటి పాటలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.