ఇటీవల వరుస ఫ్లాప్‌లు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఇండస్ట్రీపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పరిశ్రమ త్వరలోనే తిరిగి పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంటుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దక్షిణాది సినిమాలకు విశేష ఆదరణ లభిస్తోందన్నారు. తెలుగు సినిమా ఈ స్థాయికి చేరడం వెనక ఎంతోమంది శ్రమ, కృషి ఉందన్నారు. ప్రేక్షకులు సౌత్ సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు.
బాలీవుడ్‌లో ఇప్పుడు మంచి సినిమాలు తీసే లోటు ఏర్పడిందని.. ఆ లోటును తీర్చేందుకు త్వరలోనే కొత్త దర్శకులు పుట్టుకొస్తారని పేర్కొన్నారు. హిందీ చిత్రపరిశ్రమ గొప్ప దర్శకులను ప్రేక్షకులకు అందించనుందని నమ్ముతున్నాని చెప్పుకొచ్చారు. కాకపోతే ముంబైకి సంబంధం లేకుండా బయటవారే అయి ఉంటారని అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. కాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్‌డమ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.