రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) వరుసగా పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్స్ కావడంతో ఆచితూచి సినిమాలను తీస్తున్నాడు. ఇప్పటికే ‘కింగ్‌డమ్’ చిత్రంలో నటిస్తున్న రౌడీ బాయ్.. తాజాగా మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇవాళ మనోడి పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో కండలు తిరిగిన దేహంతో ధ్యానం చేస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘టాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ సినిమా బ్రిటిష్ కాలంలోని 19వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
