Vishnu Manchu: చాలా ఏళ్ల తర్వాత వెండితెరపై మళ్లీ మెరిసిన మంచు విష్ణు, తన ‘కన్నప్ప’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఆయన టైటిల్ పాత్రలో నటించిన చిత్రం కన్నప్ప. 50 ఏళ్ల ముందు రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్పకు ఇది రీమేక్. అయితే విష్ణు మూల కథను మాత్రమే తీసుకుని మిగిలినదంతా తనదైన స్టైల్లో కొత్తగా రూపొందించారు. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విష్ణుకి మంచి విజయం దక్కి చాలా రోజులే అవుతుంది. అభిమానులు, ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ, ఫస్ట్ డే రికార్డు కలెక్షన్లు సాధించి విష్ణు మంచు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నారు.
శుక్రవారం విడుదలైన ‘కన్నప్ప’ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజునే రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇండియాలోనే ఈ చిత్రం రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని సమాచారం. సినిమా టీమ్ ఈ రికార్డు కలెక్షన్లపై హర్షం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ‘కన్నప్ప’కు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. తెలుగు వెర్షన్‌లో 55.89 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా, రాత్రి షోలకు 69.87 శాతం ఆక్యుపెన్సీతో జోష్ కొనసాగింది. ఈ రేంజ్‌లో రెస్పాన్స్ రావడంతో, రెండో రోజు కూడా ఇదే జోరు కొనసాగుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీకెండ్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/vishnu-manchu-clarity-on-kannappa-ott-release/
ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటూ, ‘కన్నప్ప’ మూవీ టీమ్ సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. “కన్నప్ప ఇండస్ట్రీ హిట్‌గా అవతరించింది” అంటూ ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా, మోహన్ బాబు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించారు. విష్ణు మంచు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ (రుద్రుడు), అక్షయ్ కుమార్, కాజల్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో మెరిశారు. పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా, ఊహించినట్లే హిట్ టాక్ సొంతం చేసుకుంది. చిన్నప్పటి నుంచి దేవుడంటే ఇష్టపడని తిన్నడు (విష్ణు మంచు) నాస్తికుడి నుంచి పరమ శివుడి భక్తుడిగా ఎలా మారాడనేదే ‘కన్నప్ప’ కథాంశం. విష్ణు, ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్ తమ పాత్రల్లో అదరగొట్టారు. ఈ సాలిడ్ కమ్ బ్యాక్ తో విష్ణు మంచు బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు.