Thursday, July 10, 2025
Homeచిత్ర ప్రభKannappa Review: ‘కన్నప్ప’గా విష్ణు మంచు మెప్పించాడా?

Kannappa Review: ‘కన్నప్ప’గా విష్ణు మంచు మెప్పించాడా?

నిర్మాణ సంస్థ – ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్
నటీనటులు – విష్ణు మంచు, ప్రీతి ముకుందన్, ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, ముఖేష్ రిషి, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు
నిర్మాత – మంచు మోహన్ బాబు
దర్శకత్వం – ముఖేష్ కుమార్ సింగ్
సినిమాటోగ్రఫీ – షెల్డన్ చౌ
సంగీతం – స్టీఫెన్ డావ్సీ
ఎడిటింగ్ – ఆంథోని

- Advertisement -

పరమేశ్వరుడి మహా భక్తుడైన కన్నప్ప గురించి 1976లో రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా బాపు దర్శకత్వంలో వచ్చిన భక్తకన్నప్ప ఎంతటి సెన్సేషనల్ హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. దాదాపు యాబై ఏళ్ల తర్వాత దీనికి రీమేక్ వచ్చింది.ఈ రీమేక్‌లో విష్ణు హీరోగా నటిస్తే.. ప్రభాస్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. ఈ మూవీ టీజర్ వచ్చినప్పుడు ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే విష్ణు తగు జాగ్రత్తలు తీసుకుని సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ తీసుకు రావటంతో పాటు హైప్ కూడా క్రియేట్ చేయటంలో సక్సెస్ అయ్యారు. మరి విష్ణు నటించిన ‘కన్నప్ప’ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం

కథ –

రెండో శతాబ్దంలో స్వర్ణముఖి పరిసరాల్లోని అడవుల్లో కథ ప్రారంభం అవుతుంది. ఆ ప్రాంతాన్ని ఐదు ప్రాంతాలుగా విభజించి నాయకులు పాలిస్తుంటారు. వారిలో నాథనాథుడు కొడుకే తిన్నడు (విష్ణు మంచు). తనకు చిన్న వయసులో అమ్మవారు బలి కోరుతుందని చెప్పి, అతని స్నేహితుడుని గూడెం వాళ్లు బలి ఇస్తారు. దాంతో తిన్నడుకి దేవుడంటే నమ్మకం పోతుంది. తిన్నడు మహావీరుడుగా ఎదుగుతాడు. వారికి సమీపాన ఉండే మరో గూడెంలో ఉండే కంపడు సాయంతో పరమేశ్వరుడి వాయులింగాన్ని మహదేవ శాస్త్రి (మోహన్ బాబు) ఎవరికీ కనిపించకుండా దాస్తుంటాడు. ఆ ప్రాంతాన్ని తన కన్న కొడుక్కి కూడా చూపించడు.

వాయులింగం మహాత్యం తెలసుకున్న కాల ముఖుడు దాన్ని చేజిక్కించుకోవాలనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న నాథనాథుడు.. ఐదు గూడెలు కలిస్తే కాల ముఖుడుని ఎదిరించవచ్చునని చెబుతాడు. అందుకు ఇతర గూడెనికి చెందిన నాయకులు అంగీకరిస్తారు. సమీప గూడెంలోని నెమలి (ప్రీతి ముకుందన్)ను తిన్నడు ప్రేమిస్తాడు. ఆమె కూడా తిన్నడుని ప్రేమిస్తుంది. ఇది నెమలి తల్లికి నచ్చదు. అక్కడి నుంచి పరిస్థితులు మారిపోతాయి. అనుకోకుండా జరిగిన పరిణామాలతో తిన్నడు గూడెనికి దూరమవుతాడు. మరి నాస్తికుడైన తిన్నడుని పరమేశ్వరుడు తన భక్తుడిగా ఎలా మార్చుకుంటాడు? అసలు రుద్ర ఎవరు? రుద్ర పరిచయం తర్వాత తిన్నడు ఏమవుతాడు? తిన్నడు చివరకు కన్నప్పగా ఎలా మారుతాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

సమీక్ష-

భక్త కన్నప్పను రీమేక్ చేయాలని విష్ణు నిర్ణయంచుకోవటం నిజంగా సాహసం అనాలి. ఎందుకంటే కృష్ణంరాజు నటించిన నాటి సినిమా రీమేక్‌లో ప్రభాస్ నటించాలని అభిమానులు కోరుకున్నారు. కానీ విష్ణు తాను కన్నప్ప సినిమా తీస్తానని ప్రకటించారు. 2015లో ముందుగా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటికీ కొన్ని కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. దాదాపు పదేళ్ల పాటు విష్ణు కన్నప్ప కథ మీద వర్కవుట్ చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు వంద కోట్లను మించి బడ్జెట్ ఖర్చు పెట్టి కన్నప్ప మూవీని రీమేక్ చేశాడు. ఆసక్తికరమైన విషయమేమంటే ఇందులో ప్రభాస్ కీలక పాత్రలో నటించారు.

విష్ణు పాన్ ఇండియా మూవీగా రీమేక్ చేయాలనుకోవటం గొప్ప విషయం కాదు. కానీ సినిమా మీద కూడా హైప్ క్రియేట్ చేస్తాడా? లేదా? అనేది అందరిలోనూ మెదిలిన ప్రశ్న. ఎప్పుడైతే ప్రభాస్ ఇందులో కీ రోల్ చేస్తున్నాడనే వార్త బయటకు వచ్చిందో సినిమాపై నేషనల్ మీడియా కూడా దృష్టి సారించింది. అక్కడి నుంచి విష్ణు మెల్లమెల్లగా సినిమాపై మరింత దృష్టి పెడుతూ వచ్చాడు. అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్‌ను రంగంలోకి దించటంతో పాటు ప్రారంభంలో సినిమాపై వచ్చిన ట్రోలింగ్‌ను తగ్గించుకుంటూ వచ్చి, చివరకు మూవీపై హైప్స్ తీసుకొచ్చారు.

సినిమాలో నటీనటులను తీసుకోవటమే కాదు.. ప్రతీ పాత్రకు ప్రాధాన్యత ఉండేలా విష్ణు కేర్ తీసుకున్నాడు. కథలో చివరి 20 నిమిషాలు మినహాయిస్తే మిగతాదంతా కల్పితమే. విష్ణు కథను చక్కగా రాసుకుంటూ వచ్చాడు. తిన్నడు పాత్రకు సంబంధించిన లుక్, నటన విషయంలో ప్రేక్షకులను ఆయన మెప్పించారు. ప్రీతి ముకుందన్ నెమలి పాత్రలో అందంగా ఒదిగిపోయింది. అక్షయ్ కుమార్ శివుడుగా, రుద్ర అనే పాత్రలో ప్రభాస్, కిరాతకుడు పాత్రలో మోహన్ లాల్ ఇలా అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. సినిమా ప్రథమార్థమంతా తిన్నడు తన గూడెంను ఎలా కాపాడుకున్నాడనే కోణంలోనే సాగుతూ వచ్చింది. అయితే ఇంటర్వెల్ బ్లాక్‌ను ద్వాపర యుగానికి కనెక్ట్ చేస్తూ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉంది. సెకండాఫ్‌లో ఎప్పుడు వస్తుందా? ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుందోనని ఎదురు చూసిన ప్రేక్షకులకు, రుద్ర పాత్ర కనువిందు చేసింది. ప్రభాస్ పాత్ర కొంత సేపే కనిపించినా తనదైన మార్క్ చూపించాడు. మోహన్ బాబు మహదేవ శాస్త్రిగా మెప్పించారు. ఆయన నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సాంకేతికంగా చూస్తే ముఖేష్ కుమార్ సింగ్ సినిమాను ఆకట్టుకునేలా తీశారు. మహాభారతం సీరియల్‌ను ఎంత బాగా తీశారో కన్నప్ప టేకింగ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ విజువల్స్ పరావాలేదు. స్టీఫెన్ డావ్సీ అందించిన సంగీతంలో పాటలు పాడుకునేంతగా కనెక్ట్ కాలేదు. అయితే బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బావుంది. సన్నివేశాలను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లటంలో స్టీఫెన్ బీజీఎం ఎంతో ప్లస్ అయ్యింది. వీఎఫ్ఎక్స్కూ డా కొన్ని చోట్ల అంతగా బావున్నట్లు అనిపించలేదు. రాయలసీమ ప్రాంతంలో జరిగిన కథ అయినప్పటికీ యాస కనపడలేదు. ఇక లొకేషన్స్ సినిమాకు మైనస్ అనే చెప్పాలి. న్యూజిలాండ్ లో చిత్రీకరించినప్పటికీ ఎక్కడో ఏదో వెలితిగా అనిపించింది. నాటి కన్నప్పను నేటి తరం ప్రేక్షకులకు నచ్చేలా విష్ణు అండ్ టీమ్ ఎలా రీమేక్ చేసిందో తెలుసుకోవాలంటే మాత్రం సినిమా థియేటర్‌కు వెళ్లాల్సిందే.

చివరగా.. ‘కన్నప్ప’… ఆకట్టుకున్న శివ భక్తుడి కథ

రేటింగ్ – 3/5

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News