Shefali Jariwala Death Mystery: ప్రముఖ బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా (42) శుక్రవారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ‘కాంటా లగా’ పాటతో ఫేమస్ అయిన షెఫాలీ ఆ తర్వాత ‘బిగ్ బాస్ 13’లోకి ఎంట్రీ ఇచ్చి మరింత ఫేమ్ సంపాదించుకున్నారు. షెఫాలీ హఠాత్తు మరణం బీ టౌన్ లో హాట్ టాఫిక్ గా మారింది.
కారణం అదేనా?
షెఫాలీ మరణానికి గుండెపోటే కారణమని ప్రాథమికంగా వైద్యులు నిర్ధారించినప్పటికీ పూర్తి కారణం తెలియాలంటే పోస్టు మార్టం రిపోర్టు వచ్చే వరకు వేచి చూడాలి. దర్యాప్తులో భాగంగా.. పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు షెఫాలీ నివాసాన్ని పరిశీలించారు. వారికి అక్కడ చర్మ సౌందర్యం కోసం వాడే గ్లూటాథియోన్, విటమిన్ సి ఇంజెక్షన్లు, అసిడిటీ మాత్రలు లభించాయి. ఈ క్రమంలో ఆమె యాంటీ-ఏజింగ్ ఇంజక్షన్లు తీసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిత్యం యవ్వనంగా ఉండేందుకు వైద్యుల సలహాతో యాంటీ ఏజింగ్ ఇంజిక్షన్లను తీసుకుంటూ ఉంటారు సెలిబ్రెటీలు. షెపాలీ విషయంలో కూడా అదే జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఉపవాసం పాటిస్తూ ఇంజిక్షన్ తీసుకోవడం వల్ల బాడీలో బీపీ ఒక్కసారిగా పడిపోయి హార్ట్ ఎటాక్ కు గురై ఉండొచ్చని తెలుస్తోంది. షఫాలీ గత ఎనిమిదేళ్లుగా ఈ యాంటీ ఏజింగ్ ఇంజక్షన్లను వాడుతున్నట్లు బీ టౌన్ లో జోరుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
వైద్యులు ఏమంటున్నారు?
నిద్రలేకపోవడం, స్టెరాయిడ్ల వాడకం, మహిళల్లో హార్మోన్ థెరపీలు, డ్రగ్స్ అధికంగా తీసుకోవడం గుండె జబ్బులకు దారితీస్తున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. వీటికి తోడు మానసిక ఒత్తిడి, సోషల్ మీడియా వ్యసనం వంటివి బీపీని, కార్టిసాల్ స్థాయిలను పెంచి గుండె జబ్బులకు కారణమవుతున్నాయని వైద్యులు అంటున్నారు. సెలబ్రిటీలైనా, సామాన్యులైనా ఫిట్ గా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.