తమిళ స్టార్ హీరో విశాల్(Vishal) మరోసారి అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కూవాగంలోని కూత్తాండర్ ఆలయంలో ఆదివారం రాత్రి ట్రాన్స్ జెండర్ అందాల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. స్టేజీపై ఉన్న విశాల్ పలువురితో మాట్లాడుతూ కనిపించాడు. అయితే ఉన్నట్టుండి ఆయన వేదికపైనే స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే నిర్వాహకులు ఆయనకు ప్రథమ చికిత్స అందించి సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం విశాల్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తాజాగా విశాల్ ఆరోగ్యంపై ఆయన మేనేజర్ హరి క్లారిటీ ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం విశాల్ ఆహారం తీసుకోలేదని, కేవలం జ్యూస్ మాత్రమే తాగారని చెప్పుకొచ్చాడు. దీంతో నీరసం వచ్చి స్పృహ కోల్పోయారని తెలిపారు. సమీపంలోకి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించామని..ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పాడు. కాగా ఇటీవల ‘మద గజ రాజా’ మూవీ ప్రమోషన్స్ సమయంలోనూ విశాల్ చాలా నీరసంగా కనిపించారు. బక్కచిక్కిపోయి, బలహీనంగా వణుకుతూ మాట్లాడారు. అయితే విశాల్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడని ఆయన టీమ్ చెప్పింది. మళ్లీ ఇప్పుడు అనారోగ్యానికి గురికావడంతో అభిమానులు కంగారు పడుతున్నారు.