ఐకాన్ స్టార్ అల్లు అర్జున్((Allu Arjun) నటించిన ‘పుష్ప 2′(Pushpa 2) మూవీ రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. రిలీజైన రోజు నుంచి అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే అత్యంత వేగంగా రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఇక హిందీ ఇండస్ట్రీలో అయితే ఈ సినిమాకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీంతో బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల కన్నా బన్నీ సినిమాకు హయ్యస్ట్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే హిందీలో రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డులకు ఎక్కింది.
తాజాగా హిందీ వెర్షన్‍లో 25 రోజుల్లోనే రూ.770.25 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఈమేరకు మూవీ యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పుష్ఫరాజ్ వేట కొనసాగుతూనే ఉందని రాసుకొచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 25 రోజుల్లో 1709.63 కోట్ల వసూళ్లను సాధించినట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు మనోబాల తెలిపారు. దీంతో భారతీయ సినీ చరిత్రలో ఓవరాల్‌గా అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ తొలిస్థానంలో ఉండగా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి2’ మూవీ రెండో స్థానంలో ఉంది. ఇలాగే కలెక్షన్లు కొనసాగితే ‘బాహుబలి2’ రికార్డును ‘పుష్ప2’ బద్దలుకొట్టే అవకాశాలు ఉన్నాయి.