10 Pilgrims Dead In West Bengal Bus Accident: పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో 10 మంది మరణించారు. ఈ ఘటనలో మరో 35 మంది గాయపడినట్లు అధికారులు ధృవీకరించారు. మరణించిన వారిలో ఎనిమిది మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
ఈ యాత్రికుల బస్సు బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లా, మోతీహరి నుండి గంగాసాగర్ సందర్శనకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన పుర్బా బర్ధమాన్ జిల్లాలోని NH-19 వద్ద ఫగుయిపూర్ సమీపంలో జరిగింది. గాయపడిన వారిలో ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు. గాయపడిన వారందరినీ బర్ధమాన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చేర్చారు. బస్సులో మొత్తం 45 మంది యాత్రికులు ఉన్నారని, వారి కుటుంబ సభ్యులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ అధికారులతో సంప్రదించి, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని, మృతదేహాలను వారి స్వస్థలాలకు చేర్చడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.


