Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుSuicide: 13 ఏళ్ల బాలిక ఆత్మహత్య.. అదే కారణమా?

Suicide: 13 ఏళ్ల బాలిక ఆత్మహత్య.. అదే కారణమా?

13-Year-Old Girl Dies by Suicide in Hyderabad: చదువుల ఒత్తిడిలో ఓ పసిప్రాణం అర్థాంతరంగా తనువు చాలించింది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. మంజీరా ట్రినిటీ హోమ్స్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న 13 ఏళ్ల బాలిక, ఆకుల వెంకట లాస్య ప్రియ, గురువారం రాత్రి 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

- Advertisement -

చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు ఇంతటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం, తమ జీవితాలను ముగించుకోవడం ఆందోళన కలిగించే విషయం. రెండు రోజుల క్రితమే ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో ఓ మెడికల్ విద్యార్థి సైతం ఇదే విధంగా తన ప్రాణాలను తీసుకున్నాడు. ఈ ఘటన మరువక ముందే లాస్య ప్రియ ఆత్మహత్య అందరినీ కదిలించింది.

ఇదీ జరిగింది..

లాస్య ప్రియ ఇటీవల జరిగిన పేరెంట్-టీచర్ మీటింగ్‌కు తన తల్లిదండ్రులతో కలిసి హాజరైంది. ఆ సమావేశంలో, టీచర్లు లాస్య ప్రియ సరిగ్గా చదవడం లేదని, పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తున్నాయని ఆమె తల్లిదండ్రులతో చెప్పారు. ఈ విషయంపై తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో లాస్య ప్రియ తీవ్ర మనస్తాపానికి గురైంది. అదే ఆమెను తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి నెట్టేసి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఆ మనోవేదనే చివరికి ఆమె ఆత్మహత్యకు దారి తీసిందని తెలుస్తోంది.

ఈ ఘటన మరోసారి విద్యార్థులపై పెరుగుతున్న చదువుల ఒత్తిడిని కళ్ళకు కట్టింది. మార్కుల వెనుక పరుగులు తీస్తూ, పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మనం విస్మరిస్తున్నామా అనే ప్రశ్నను ఈ దుర్ఘటన లేవనెత్తుతోంది. ముఖ్యంగా టీనేజ్ దశలో ఉన్న పిల్లలతో ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా వ్యవహరించాలని, వారిపై ఒత్తిడి పెంచవద్దని మనస్తత్వ నిపుణులు పదేపదే సూచిస్తున్నారు. వారి మార్కులు ఎంత ముఖ్యమో, వారి చిరునవ్వు, ఆత్మవిశ్వాసం కూడా అంతే ముఖ్యమని ఈ విషాద ఘటన గుర్తుచేస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad