Girl Who Was Set On Fire In Puri Dies In AIIMS Delhi: ఒడిశాలోని పూరీ జిల్లాలో అత్యంత దారుణంగా చిత్రవధకు గురైన 15 ఏళ్ల బాలిక ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాదకర ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఏం జరిగిందంటే..
జూలై 19న ఉదయం పూరీ జిల్లాలోని భార్గవి నది ఒడ్డున ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఈ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దాడిలో బాలికకు 70 శాతం కాలిన గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను తొలుత భువనేశ్వర్ ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం జూలై 20న ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అయితే, ప్రాణాలను నిలబెట్టడానికి వైద్యులు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఈ మరణంపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఎక్స్ వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “బాలంగ ప్రాంతానికి చెందిన బాలిక మరణవార్త విని నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రభుత్వ ప్రయత్నాలు, ఢిల్లీలోని ఎయిమ్స్‌లో నిపుణులైన వైద్య బృందం నిరంతరం శ్రమించినప్పటికీ, ఆమె ప్రాణాలను కాపాడలేకపోయాము. ఆ బాలిక ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ తీరని నష్టాన్ని భరించే శక్తిని ఆమె కుటుంబానికి ప్రసాదించమని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. నిందితులను తక్షణమే గుర్తించి శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.


