15-Year-Old Girl Shot Dead in Delhi by Alleged Lover: దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే దారుణం జరిగింది. స్నాక్స్ కొనుక్కునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన 15 ఏళ్ల బాలికను ఓ యువకుడు అతి కిరాతకంగా కాల్చి చంపాడు. ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
మాట్లడటం లేదనే కోపంతో..
పోలీసుల కథనం ప్రకారం, బాధితురాలు సాయంత్రం సమయంలో ఇంటికి సమీపంలో ఉన్న దుకాణానికి స్నాక్స్ కోసం వెళ్లింది. అప్పటికే అక్కడ కాపుకాసిన నిందితుడు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. గత కొంతకాలంగా బాధితురాలు అతనితో మాట్లాడటం మానేసిందని, ఇదే కోపంతో నిందితుడు తన వెంట తెచ్చుకున్న తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాలికను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి, నిందితుడిని గుర్తించారు. కొన్ని గంటల్లోనే ప్రధాన నిందితుడితో పాటు, అతనికి ఆయుధం సమకూర్చిన స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. జనసంచారం ఉన్న ప్రాంతంలో జరిగిన ఈ దారుణ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. నగరంలో ఆడపిల్లల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.


