Road Accident : సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. సైనికులతో వెలుతున్న ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 16 మంది జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
చట్టేన్ నుంచి థంగు ప్రాంతంలోని బోర్డర్ పోస్ట్‌కు శుక్రవారం ఉదయం మూడు వాహనాల్లో జవాన్లు బయలుదేరారు. జెమా ప్రాంతంలో ట్రక్కు ములుపు తీసుకునే సమయంలో వాహనం వెనక్కి ఒరిగి లోయలో పడిపోయింది. ఆ సమయంలో ట్రక్కులో 20 మంది ఉన్నారు. చాలా ఎత్తు నుంచి పడడంతో వాహనం ముక్కలైంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి.
ఘటనా స్థలంలో 16 మంది మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో 13 మంది జవాన్లు ఉండగా, ముగ్గురు జూనియర్ కమిషన్ అధికారులు ఉన్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా వారిని ఉత్తర బెంగాల్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కాగా.. ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. “ఉత్తర సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. వారి సేవ మరియు నిబద్ధతకు దేశం ఎంతో కృతజ్ఞతలు తెలుపుతోంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.” అని ట్వీట్ చేశారు.