Woman Stabbed To Death By Lover Over Infidelity Suspicion: ఈశాన్య ఢిల్లీలోని నంద్ నగరి ప్రాంతంలో సోమవారం ఉదయం దారుణం జరిగింది. 20 ఏళ్ల యువతిని ఆమె ఇంటికి కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే ప్రియుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ హత్యకు కారణం, ఆమె వేరొకరితో మాట్లాడుతోందనే అనుమానమేనని పోలీసులు తెలిపారు. నిందితుడిని నంద్ నగరికి చెందిన ఆకాష్ (23) గా గుర్తించారు. ఇతను వృత్తిరీత్యా స్వీపర్‌గా పనిచేస్తున్నాడు.
ALSO READ: Fake Promise: ఆధ్యాత్మిక గురువును కలిపిస్తానని నమ్మించి మహిళపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్
పోలీసుల కథనం ప్రకారం, యువతికి, ఆకాష్‌కు మధ్య గత మూడు నుంచి నాలుగేళ్లుగా సంబంధం ఉంది. అయితే, ఇటీవల ఆ యువతి అతనికి దూరం అవుతుండటంతో, వేరొకరితో మాట్లాడుతోందనే అనుమానంతో ఆకాష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన ఆకాష్, ఆమెను పలుమార్లు కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను జీటీబీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
బాధితురాలి తల్లి ఇచ్చిన వివరాలు హృదయ విదారకంగా ఉన్నాయి. “ఆమె నా ఏకైక కూతురు. బయటకు వెళ్లడానికి ఇష్టపడేది కాదు. ఈ రోజు కేవలం సమోసాలు తీసుకురావడానికి మాత్రమే వెళ్ళింది. నేను స్నానం చేస్తుండగా, తనకు సమోసాలు కావాలా అని అడిగింది. కానీ నేను ఉపవాసం ఉన్నానని చెప్పాను.” ఆ తర్వాత, “నేనే చంపాను, నేనే చంపాను” అని అరుస్తూ నిందితుడు వారి వీధిలోంచి వెళ్లడం విన్నానని, వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి చూడగా, తమ కూతురు పాఠశాల సమీపంలో పడి ఉందని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు, కొంతకాలంగా ఆకాష్ తన కూతురిని వేధిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆకాష్ తాత, మామకు ఫిర్యాదు చేసినా, వారు అతనికి బుద్ధి చెప్తామని హామీ ఇచ్చినా, చివరకు ఈ దారుణం జరిగింది. నంద్ నగరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


