Class 8 National Skater Jumps From School Building: మధ్యప్రదేశ్‌లోని రత్లాం నగరంలో గుండెలు పిండేసే ఘటన జరిగింది. చిన్న తప్పుకు ప్రిన్సిపాల్ మందలించడంతో భయపడిన ఓ విద్యార్థి స్కూల్ భవనం పైనుంచి దూకేశాడు (Suicide Attempt). ఇది కేవలం ఆత్మహత్యా ప్రయత్నం కాదు, ఒత్తిడి తట్టుకోలేక ఓ చిన్నారి తీసుకున్న విపరీత నిర్ణయం. బాధితుడు సాధారణ విద్యార్థి కాదు, స్కేటింగ్‌లో రెండుసార్లు జాతీయ స్థాయికి వెళ్లిన ప్రతిభావంతుడు కావడం గమనార్హం.
అసలేం జరిగింది?
రత్లాం నగరంలోని డోంగ్రే నగర్ ప్రైవేట్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడు గురువారం స్కూల్‌కు మొబైల్ ఫోన్ తీసుకెళ్లాడు. నిబంధనలకు విరుద్ధంగా క్లాస్‌రూమ్‌లో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఈ విషయం స్కూల్ యాజమాన్యం దృష్టికి వెళ్లింది. దీంతో శుక్రవారం ఉదయం స్కూల్ యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులను పిలిపించింది.
ఆ నాలుగు నిమిషాలు నరకం..
ప్రిన్సిపాల్ గదికి వెళ్లిన ఆ విద్యార్థి.. తన తప్పును ఒప్పుకుంటూ బతిమాలాడు. ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ప్రిన్సిపాల్ గదిలో ఉన్న ఆ నాలుగు నిమిషాల్లో ఆ చిన్నారి ఏకంగా 52 సార్లు “సారీ సార్.. సారీ.. ఇంకెప్పుడూ చేయను” అంటూ చేతులు జోడించి వేడుకున్నాడు. భయంతో వణికిపోయాడు.
కెరీర్ ఎండ్ చేస్తా..
అయితే, ప్రిన్సిపాల్ మాత్రం శాంతించలేదు. “నీ కెరీర్ నాశనం చేస్తా (End your career).. నిన్ను సస్పెండ్ చేస్తా.. నీ మెడల్స్ అన్నీ వెనక్కి తీసుకుంటా” అని ప్రిన్సిపాల్ బెదిరించినట్లు బాధితుడు తెలిపాడు. స్కేటింగ్ అంటే ప్రాణంగా భావించే ఆ కుర్రాడు.. తన మెడల్స్ పోతాయనే మాటకు తట్టుకోలేకపోయాడు. తీవ్ర భయం, ఆవేదనతో ప్రిన్సిపాల్ గదిలోంచి పరుగున బయటకు వచ్చాడు. కారిడార్‌లో వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి, క్షణాల్లో మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు.
బయట పాపం ఆ తండ్రి..
ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే.. ఆ సమయంలో విద్యార్థి తండ్రి ప్రీతమ్ కటారా స్కూల్ వెయిటింగ్ హాల్‌లోనే కూర్చుని ఉన్నారు. తన కొడుకు గురించి మాట్లాడటానికి పిలిచారని ఆయన వచ్చారు. కొద్ది దూరంలో తన కొడుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడని, చావు బతుకుల మధ్య ఉన్నాడని ఆయనకు తెలియదు. “పిల్లాడు కింద పడిపోయాడని స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది.. తర్వాత వెంటనే హాస్పిటల్ రమ్మన్నారు” అని ఆ తండ్రి కన్నీటిపర్యంతమయ్యాడు.
పరిస్థితి నిలకడగా ఉంది
తీవ్రంగా గాయపడిన విద్యార్థిని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఎస్డీఎం ఆర్చి హరిత్ మాట్లాడుతూ.. స్కూల్ రూల్స్ ప్రకారం ఫోన్ తేవడం, టీచర్ల ఫోన్లు వాడటం నిషిద్ధం అయినా, పరిస్థితి ఇంత దూరం వెళ్తుందని ఊహించలేదని అన్నారు. విద్యార్థి స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్న పిల్లల పట్ల స్కూల్ యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ఎంత సున్నితంగా వ్యవహరించాలో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

