8 Women Die After Van Falls Off On Way To Temple: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలయానికి వెళ్తున్న భక్తులతో కూడిన వ్యాన్ లోయలో పడిపోయింది. దీంతో ఎనిమిది మంది మహిళలు మరణించగా, మరో 29 మంది గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఎక్కువగా చిన్నారులు, మహిళలే..
పోలీసులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, సుమారు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న పికప్ వ్యాన్.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కొండ మార్గంలో 25 నుంచి 30 అడుగుల లోతులో పడిపోయింది. అందులో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ దుర్ఘటన ష్రావణ మాసంలో పవిత్రమైన సోమవారం సందర్భంగా కేడ్ తాలూకాలోని శ్రీ క్షేత్ర మహాదేవ్ కుండేశ్వర్ ఆలయానికి వెళ్తున్నప్పుడు జరిగింది.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా పాపల్వాడి గ్రామానికి చెందినవారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అంబులెన్సుల సహాయంతో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
ప్రధాని సంతాపం..
ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.


