మనం లైనేస్తే అమ్మాయి పడాల్సిందే… లేదంటే ప్రాణాలు పోవాల్సిందే. ఇలా తయారైంది కొందరు యువకుల మనస్తత్వం. ప్రేమ అంటూ వెంట పడడం, అమ్మాయి నో చెప్తే ప్రాణాలు తీయడం ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి లవ్ స్టోరీ లు.. కాదు, కాదు… క్రైమ్ (Crime) స్టోరీలు రెగ్యులర్ గా వింటూనే ఉన్నాం. తాజాగా విశాఖ జిల్లాలో నీరజ్ అనే యువకుడు తనను రిజెక్ట్ చేసింది అన్న కోపంతో ఓ యువతిపై దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే…
విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం బీసీ రోడ్డులో ఈ క్రైమ్ (Crime) చోటు చేసుకుంది. యువతి కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఓంశాంతి ఆశ్రమానికి తరచూ వెళ్తుంటారు. అక్కడే యువతికి నీరజ్ పరిచయమయ్యాడు. కొద్దిరోజులు గడిచాక తనను ప్రేమించాలంటూ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోకుండా వెంటపడడంతో ఇంట్లో చెప్పేసింది యువతి. ఆమె కుటుంబసభ్యులు వార్నింగ్ ఇచ్చినా నీరజ్ సైలెంట్ అవలేదు. వేధింపుల డోస్ పెంచాడు.
యువతి ఫోటోలని మార్ఫింగ్ చేసి మార్ఫింగ్ న్యూడ్ ఫోటోలు, బూతు వీడియోలు కుటుంబసభ్యులకు పంపాడు. దీంతో కలత చెందిన కుటుంబం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఏం చేసినా అమ్మాయి లొంగక పోవడమే కాకుండా తనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో కోపంతో ఊగిపోయాడు నీరజ్. ఆమెని చంపేయాలని డిసైడ్ అయ్యాడు. రాడ్ తీసుకుని యువతి ఇంటికి వెళ్లి ఆమెపై కర్కశంగా దాడి చేసి పారిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. యువతి తలకి తీవ్ర గాయాలయ్యాయని, రెండు చేతులు ఫ్రాక్చర్ అయ్యాయని వైద్యులు వెల్లడించారు. మరో 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని చెబుతున్నారు. ఘటనపై యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీరజ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.