Chennai: 28ఏళ్ల అందమైన యువతి డబ్బుకోసం అడ్డదారులు తొక్కింది. ఒకరుకాదు ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు వ్యక్తులను వివాహం చేసుకుంది. నగలతో ఉడాయించింది. చివరికి ఆ కిలాడీ లేడీని తాంబరం పోలీసులు అరెస్టు చేశారు. తనను మోసంచేసిందని గుర్తించిన తాంబరంకు చెందిన నాలుగో భర్త.. విలాసవంతమైన జీవితం కోసం మోసాలకు పాల్పడుతున్న యువతి విషాన్ని గుట్టురట్టు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఆన్‌లైన్ ఫుడ్‌డెలివరీ సంస్థలో పనిచేస్తున్న తాంబరం రంగనాథపురం ప్రాంతానికి చెందిన 25ఏళ్ల నటరాజన్ కు ముడిచ్చూరు రహదారిలోని బేకరీలో పనిచేస్తున్న 28ఏళ్ల యువతి అభినయతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. చివరకు నటరాజన్ తన కుటుంబ సభ్యులు ఆమోదంతో ఆగస్టు 29న ఆమెను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన ఇరవైరోజులకే అభినయ నగలు, నగదుతో ఉడాయించింది. అభినయ ఎటుపోయిందని ఆచూకీ కోసం భర్త కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఉపయోగం లేకుండా పోయింది. ఆమె ఉపయోగించే రెండు ఫోన్ నెంబర్లు పనిచేయలేదు. చివరకు నటరాజన్ తాంబరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదుచేసుకొని ఆమెను వెతికే పనిలోపడగా అసలు విషయం తెలిసింది. సెమ్మంజెరిలో నివాసముంటున్న అభినయను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేయగా.. అప్పటికే ముగ్గురిని పెళ్ళాడి నగలు, నగదు దోచుకున్నట్లు వెల్లడైంది. మొదటి పెళ్లి చేసుకున్న పదిరోజులకే నగలు, డబ్బుతో పరారైంది. రెండవ పెళ్లి మదురైకి చెందిన సెంథిల్‌కుమార్‌తో అయింది. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడున్నాడు. ఆ తర్వాత సంవత్సరానికి శెంథిల్‌కుమార్‌ను పెళ్లిచేసుకుంది. అక్కడ నగలు, డబ్బు తీసుకొని ఉడాయించింది. తాజాగా తాంబరం నటరాజన్‌ను వివాహమాడింది. అభినయ వద్దనున్న 32 సిమ్‌కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. అభినయ మూడు, నాలుగో పెళ్లికి సహకరిచిన రెండో భర్తను కూడా పోలీసులు అరెస్టు చేశారు.