Road Accident Rangareddy district: తెలంగాణలో గురువారం రెండు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఘటనలో ఇద్దరు చిన్నారులతో పాటు ఇద్దరు యువకులు మృతి చెందారు. ఒకే జిల్లాలో రెండు చోట్ల ప్రమాదాలు చోటుచేసుకోవడంతో మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: https://teluguprabha.net/crime-news/world-war-ii-bomb-defused-in-bengals-birbhum-mystery-remains/
రంగారెడ్డి జిల్లాలోని నాగార్జున సాగర్ హైవే యాచారం వద్ద ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తండ్రి తన ముగ్గురు కుమారులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు చిన్నారులు అభిరామ్(9), రాము(05) అక్కడికక్కడే మృతి చెందారు. మరో కుమారుడు, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ప్రమాదం.. అదే జిల్లాలోని చేవెళ్ల పరిధిలో చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం పగిడాల గ్రామానికి చెందిన స్నేహితులు సల్మాన్(26), వడ్ల రవి(25).. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మణికొండలోని శివపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. గురువారం తెల్లవారుజామున చేవెళ్ల పరిధిలోని పరిగి పట్టణంలో బంధువులను కలిసి హైదరాబాద్‌కు బైక్‌పై బయలుదేరారు.
Also Read: https://teluguprabha.net/crime-news/kakinada-tuni-rape-case-accused-suicide/
ఈ క్రమంలో మల్కాపూర్ గేటు వద్దకు రాగానే.. వీరిద్దరూ ప్రయాణిస్తున్న బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఘటనలో సల్మాన్, రవికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న చేవెళ్ల పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు స్నేహితుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


