యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో కల్తీ పాల దందా జోరుగా కొనసాగుతుంది. కొందరు పాల వ్యాపారులు కాసులకు కక్కుర్తి పడి పాలలో విష పదార్థాలను కలిపి కాలకూట విషంగా మార్చి ప్రజలకు సరఫరా చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నేపథ్యంలో భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని కనుముకుల, గౌస్ కొండ గ్రామాలలో కల్తీ పాలు తయారు చేస్తున్న పాల వ్యాపారులు వలిగొండ పాండు, అస్గర్ లను అదుపులోకి తీసుకోవడం మండలంలో కలకలం రేపుతుంది.
వలిగొండ పాండు వద్ద నుండి 150 లీటర్లు కల్తీ పాలు, 2 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 డోలోఫర్ స్కీమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ మరియు అస్గర్ వద్ద నుండి 200 లీటర్ల కల్తీ పాలు ,100 ఎమ్ ఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 3 డోలోఫర్ స్కీమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ ను భువనగిరి ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితులను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సైలు విక్రమ్ రెడ్డి, సురేష్ లు తెలిపారు.