Ahmedabad Husband Murder : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దృశ్యం సినిమా కథను గుర్తు చేసే ఓ భయంకర హత్య కలకలం రేపింది. భార్య కృష్ణా(32) తన భర్త రాజ్ పటేల్(35)ను అక్టోబర్ 25న చంపి, శవాన్ని కిచెన్ ఫ్లోరింగ్ కింద పాతిపెట్టింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపింది.
గుజరాత్ మెగానీ ప్రాంతం ఓ ఇంట్లో జరిగిన దారుణ సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దంపతుల మధ్య ఆర్థిక సమస్యలు, మద్యం సేవించి గొడవపడటమే హత్యకు కారణాలుగా తెలుస్తుంది. పోలీసులు చిన్న క్లూల ద్వారా ఈ రహస్యాన్ని చేధించారు. రాజ్ పటేల్ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ నేపథ్యంలో మద్యానికి బానిసై, ఆదాయాన్ని ఖర్చు చేసేవాడు. దీనితో ఇంటి ఆర్థిక పరిస్థితి దిగజారడంతో భార్య కృష్ణా తరచూ గొడవలు పడేది. ఈ నేపథ్యంలోనే గొడవలు పెరిగి గొడ్డలితో రాజ్‌ను నరికి చంపేసినట్లు తెలుస్తుంది. హత్య తర్వాత భయంతో శవాన్ని కిచెన్‌లోనే ఫ్లోర్ కింద దాచి పెట్టింది.
అక్టోబర్ 28న రాజ్ మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసులు మొదట కృష్ణాను ప్రశ్నించగా “అప్పులు చెల్లించలేక పారిపోయాడు” అని చెప్పింది. కానీ, పోలీసులు సందేహంతో సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ లొకేషన్‌లు పరిశీలించారు. రాజ్ ఫోన్ లాస్ట్ సిగ్నల్ ఇంటి సమీపంలోనే ఉండటం గమనించారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పోలీసులకు కృష్ణా అసలు విషయం చెప్పేసింది. వెంటనే ఇంటిని సెర్చ్ చేసి, కిచెన్ టైల్స్ తొలగించారు. అక్కడ శవం కనిపించటంతో పోలీసులు దర్యాప్తుకు ఫోరెన్సిక్ టీమ్ కు పంపగా గొడ్డలితో నరికి చంపేసినట్లు బయటపడింది.
ఇక పోలీసులుకు ఇచ్చిన వాగ్మూలంలో కృష్ణా.. “అతను ఎప్పుడూ నన్ను కొట్టేవాడు. పిల్లల్ని నన్ను చూసుకోకుండా, మద్యానికి బానిసై అప్పులు చేశాడు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా” అని తెలిపింది. ఇక కేసులో కృష్ణాతో పాటు ఆమెకు సహకరించిన స్నేహితురాలు లక్ష్మిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


