Anantapur Robbery: అనంతపురం జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వరుస చోరీలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు జిల్లాలో చాలా దొంగతనాలు నమోదైనట్లు సమాచారం. ఇళ్లు, దుకాణాలు, వ్యవసాయ పొలాలు దొంగల లక్ష్యంగా మారాయి, దీంతో పోలీసులకు ఈ సమస్య సవాలుగా నిలిచింది. అయితే ఈ క్రమంలోనే తాజాగా జిల్లాలో మరో చోరీ ఘటన చోటు చేసుకుంది.
దర్జాగా కారులో వచ్చి..
చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు వద్ద దొంగ సీసీ కెమెరాకు చిక్కాడు. దర్జాగా కారులో వచ్చిన ఓ దొంగ ఓ దుకాణం వద్ద కారు ఆపాడు. ఆ తర్వాత రెండు దుకాణాలను లక్ష్యంగా చేసుకున్నాడు. ఇనుప రాడ్‌తో షట్టర్‌ను తొలగించి, ఒక దుకాణంలో రూ.1 లక్ష నగదును, మరో దుకాణంలో సిగరెట్లు, వాటర్ బాటిళ్లను దొంగిలించాడు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయింది.
దొంగలకు సౌలభ్యంగా..
అనంతపురం జిల్లాకు పొరుగున కర్ణాటక, తమిళనాడుతో పాటు తెలంగాణ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉండటం, 44వ జాతీయ రహదారి సౌలభ్యంగా ఉండటం దొంగలకు కలిసొచ్చే అంశాలుగా మారాయి. తనిఖీ కేంద్రాలు సమర్థవంతంగా లేకపోవడంతో దొంగలు ఇష్టారీతిన రాకపోకలు సాగిస్తూ, చోరీలు చేసి సులభంగా పారిపోతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులపై విమర్శలు..
అనంతపురం జిల్లాలో దొంగల గుర్తింపు, అరెస్టు, చోరీలకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు ఆ మధ్య బాగానే వినిపించాయి. రాత్రి గస్తీలు తూతూ మంత్రంగా సాగుతున్నాయని, తగిన నిఘా వ్యవస్థ లేకపోవడం దొంగలకు అనుకూలంగా మారిందని విమర్శలు వ్యక్తమయ్యాయి.


