Bride suicide on wedding night : పచ్చని పందిరిలో పెళ్లి మంత్రాలు ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. కాలి పారాణి ఇంకా తడి ఆరనే లేదు. అప్పటిదాకా ఆనందంతో వెలిగిపోయిన ఆ ఇంట పెను విషాదం అలముకుంది. పెళ్లైన కొన్ని గంటలకే, శోభనం గదిలో నవవధువు ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించడం పెను కలకలం రేపింది. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన వెనుక అసలేం జరిగింది..? ఉదయం నవ్వుతూ కనిపించిన ఆ నవవధువు రాత్రికి ఎందుకింతటి తీవ్ర నిర్ణయం తీసుకుంది.?
ఆనందం నుంచి విషాదంలోకి : సోమందేపల్లి మణికంఠ కాలనీకి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షిత (22). ఆమెకు కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన నాగేంద్రతో సోమవారం, ఆగస్టు 4న, అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. బంధుమిత్రుల సందడి, ఆనందోత్సాహాల మధ్య పెళ్లి వేడుక కన్నుల పండువగా సాగింది. అయితే, ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు.
శోభనం రాత్రి ఏం జరిగింది : వివాహం జరిగిన రోజే రాత్రి నూతన దంపతులకు శోభనానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వరుడు నాగేంద్ర, స్వీట్లు తీసుకురావడానికి బయటకు వెళ్లాడు. ఇంట్లో వారంతా పెళ్లి పనుల హడావిడిలో నిమగ్నమై ఉన్నారు. ఇదే సమయంలో హర్షిత తన గదిలోకి వెళ్లింది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.
తలుపులు పగలగొట్టి చూడగా, లోపల కనిపించిన దృశ్యం వారిని నిశ్చేష్టులను చేసింది. హర్షిత ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. అప్పటిదాకా పెళ్లికూతురిగా కళకళలాడిన తమ కుమార్తెను అలా చూసి తల్లిదండ్రులు, బంధువులు షాక్‌కు గురయ్యారు. హుటాహుటిన ఆమెను పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది.
అంతుచిక్కని ఆత్మహత్య.. అనేక అనుమానాలు : పెళ్లిలో ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా కనిపించిన హర్షిత, ఇంతలోనే ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేది అంతుచిక్కడం లేదు. “కాళ్ల పారాణి ఆరకముందే కఠిన నిర్ణయం తీసుకుందంటే, దాని వెనుక బలమైన కారణమే ఉండి ఉంటుంది” అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెళ్లి ఆమెకు ఇష్టం లేదా? ఎవరైనా బెదిరించారా…? లేక మరేదైనా కారణం ఉందా…? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో వరుడు నాగేంద్ర, అతని కుటుంబ సభ్యులు పెళ్లి ఇంట్లోంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం పోలీసులు హర్షిత కుటుంబ సభ్యులు, బంధువులను విచారిస్తున్నారు. ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు విచారణ పూర్తయితే గానీ, హర్షిత ఆత్మహత్యకు గల అసలు కారణాలు వెలుగులోకి రావు.


