Arunachalam: తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలంలో విషాదఘటన చోటుచేసుకుంది. గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న మోక్ష మార్గంలో ఇరుక్కుని ఆంధ్రప్రదేశ్‌కు ఏపీకి చెందిన భక్తుడు మృతి చెందాడు.
లావుగా ఉండడమే కారణం: ఏపీకి చెందిన మణికుమార్ (36) తన కుటుంబ సభ్యులతో కలిసి తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాడు. అనంతరం రాత్రి సుమారు 11 గంటల సమయంలో గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయానికి చేరుకున్నాడు. దీన్ని మన తెలుగువారు మోక్ష మార్గం అని పిలుస్తారు. గుహ ఆకారంలో ఉండే ఈ ఆలయంలో భక్తులు వెనుక ద్వారం నుంచి పడుకుని లోపలికి వెళ్లి, ఇరుకైన మార్గంలో పాకుతూ ముందువైపు ద్వారం గుండా బయటకు వస్తుంటారు. అయితే మణికుమార్ శరీరాకృతి లావుగా ఉండటంతో గుహ మధ్యలోనే ఇరుక్కుపోయాడు. కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు బయటకు తీసేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో ఆయనకు ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కొంతసేపటి తర్వాత ఇతర భక్తులు తీవ్రంగా శ్రమించి ఆయనను గుహ నుంచి బయటకు తీసి 108 అంబులెన్స్లో తిరువణ్ణామలై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

