Road accident in Vizianagaram: రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న యువ వెయిట్ లిఫ్టర్‌ను లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఈ హృదయ విదారక ఘటన విజయనగరం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. దీంతో రాష్ట్ర స్థాయి క్రీడా లోకంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అసలేం జరిగిందంటే: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన తాడుతూరి భాస్కరరావు కుమార్తె సత్యజ్యోతి (26) ప్రముఖ వెయిట్ లిఫ్టర్. ఈమెతో పాటు ఆమె సోదరి సరోజా గాయత్రి సైతం ఈ క్రీడలో అనేక పతకాలు సాధించారు. సత్యజ్యోతి ప్రస్తుతం విశాఖపట్నంలోని వాల్తేరు రైల్వే డివిజన్ కార్యాలయంలో క్లర్కుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొండవెలగాడలో జరిగే రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేందుకు సత్యజ్యోతి తన సోదరి సరోజా గాయత్రితో కలిసి స్కూటీపై బయలుదేరారు. వీరు విజయనగరం సమీపంలోని వైఎస్‌ఆర్ నగర్ దాటిన తర్వాత.. ఎదురుగా వేగంగా వస్తున్న ఓ లారీ వారి స్కూటీని బలంగా ఢీకొంది. ఈ తీవ్ర ప్రమాదంలో వెయిట్ లిఫ్టర్ సత్యజ్యోతి అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె సోదరి సరోజా గాయత్రికి స్వల్ప గాయాలయ్యాయి.
సంతాపం వ్యక్తం చేసిన శాప్ ఛైర్మన్: సమాచారం అందుకున్న టుటౌన్ సీఐ శ్రీనివాసరావు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అథ్లెట్ సత్యజ్యోతి ఆకస్మిక మరణంతో కొండవెలగాడతో పాటు క్రీడా వర్గాల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. సత్యజ్యోతి మృతి పట్ల శాప్ ఛైర్మన్ రవినాయుడు, విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

