Teen Sexually Abused By 200 Men: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో హృదయాన్ని కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. సెక్స్ రాకెట్‌లో చిక్కుకున్న 14 ఏళ్ల బంగ్లాదేశ్ బాలికను పోలీసులు రక్షించగా, ఆమె చెప్పిన విషయాలు అధికారులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. కేవలం మూడు నెలల వ్యవధిలో 200 మందికి పైగా వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం పోలీసులు ఈ వాంగ్మూలాన్ని ధృవీకరించే పనిలో ఉన్నారు.
మీరా-భయందర్ వసాయి-విరార్ పోలీసులు, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU) ఆధ్వర్యంలో జూలై 26న నైగావ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి ఈ బాలికతో పాటు మరో నలుగురు బాధితులను కాపాడారు. ఈ కేసులో ఇప్పటివరకు పది మందిని అరెస్టు చేశారు. బాధితుల్లో ముగ్గురు, అరెస్ట్ అయిన వారిలో ఆరుగురు బంగ్లాదేశ్ జాతీయులే. బాలికను బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి రప్పించి వ్యభిచారంలోకి దించినట్లు పోలీసులు గుర్తించారు.
జువైనల్ డిటెన్షన్ సెంటర్‌లో బాలిక ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం… ముందుగా ఆమెను గుజరాత్‌లోని నదియాడ్‌కు తరలించారు. అక్కడ ఆమె లైంగిక వేధింపులకు గురైంది. తరువాత ఆమెను వివిధ ప్రాంతాలకు తరలించి వేధింపులకు పాల్పడ్డారు. బాలికకు హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి, బలవంతంగా ఈ వృత్తిలోకి దింపినట్లు కూడా పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు పాల్పడిన 200 మందిని గుర్తించి అరెస్టు చేయాలని హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ రాకెట్‌లో భాగమైన ఇతర నిందితుల కోసం పోలీసులు దేశంలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపించారు. ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.


