Drowning incident in Basara Godavari river : అల్లారుముద్దుగా కలిసిమెలిసి పెరిగిన ఆ ముగ్గురు అన్నదమ్ములు దైవదర్శనానికై వెళ్లి.. బహుశా తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. పవిత్రమైన గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి తరిద్దామనుకున్న వారి పాలిట అదే నది అదృశ్య మృత్యుపాశంగా మారింది. ఉదయం సంతోషంగా రైలెక్కిన ఆ సోదరులు, సాయంత్రానికి జలసమాధి అయ్యారన్న వార్త వారి కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.
కాచిగూడ నుంచి ఉత్సాహంగా పయనం : హైదరాబాద్‌లోని కాచిగూడ పరిధి చప్పలబజార్‌కు చెందిన ముగ్గురు అన్నదమ్ములు.. చంద్రశేఖర్ (38), రామచందర్ (36), మల్లేష్‌కుమార్ (31) మంగళవారం ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బాసరకు బయలుదేరారు. చదువుల తల్లి జ్ఞాన సరస్వతీ దేవిని దర్శించుకునే ముందు పవిత్ర గోదావరిలో స్నానమాచరించడం ఆనవాయితీ. రైలు దిగిన వెంటనే ఈ ముగ్గురు సోదరులు నేరుగా గోదావరి నది వైపు అడుగులు వేశారు.
నీటి ఉధృతిని అంచనా వేయలేక : స్థానికులు, పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. గోదావరి స్నానఘట్టాల వద్దకు చేరుకున్న అన్నదమ్ములు నీట్లోకి దిగారు. అయితే, నదిలో నీటి లోతు, అడుగున ఉండే సుడిగుండాల తీవ్రతను వారు సరిగ్గా అంచనా వేయలేకపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదవశాత్తూ ఒకరు లోతైన ప్రాంతానికి వెళ్లి నీట మునిగిపోతుండగా, అతడిని రక్షించే క్రమంలో మిగతా ఇద్దరు సోదరులు కూడా నీటిలో దూకారు. ఈత రాకపోవడం, నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో క్షణాల వ్యవధిలోనే ముగ్గురూ నది గర్భంలో గల్లంతయ్యారు. చూస్తుండగానే కళ్లెదుటే ఈ ఘోరం జరిగిపోవడంతో అక్కడున్న భక్తులు భయాందోళనలకు గురయ్యారు.
ముమ్మరంగా ఎస్‌డీఆర్ఎఫ్ గాలింపు : వెంటనే అప్రమత్తమైన స్థానికులు బాసర పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గల్లంతైన వారి వస్తువులు, గుర్తింపు కార్డుల ఆధారంగా బాధితులు హైదరాబాద్‌లోని చప్పలబజార్‌కు చెందిన వారని నిర్ధారించారు. వెంటనే వారి కుటుంబ సభ్యులకు ఈ చేదువార్తను చేరవేశారు. ముగ్గురు యువకుల ఆచూకీ కోసం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) రంగంలోకి దిగింది. గజ ఈతగాళ్ల సాయంతో పడవల్లో నదికి ఇరువైపులా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనతో బాసర పుణ్యక్షేత్రంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

