Crime News: పసికందును వేడినీళ్లలో వేసి ఉడికించి చంపేసిందనే కారణంగా ఓ 27 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఇదే విషయాన్ని కొన్ని నివేదికలు ప్రచురించాయి. సదరు కథనాల ప్రకారం.. బెంగళూరులోని విశ్వేశ్వరపురానికి చెందిన ఓ మహిళకు కొన్నాళ్ల క్రితం పెళ్లి జరిగింది. అయితే ఉద్యోగం కోల్పోయిన భర్త మద్యానికి బానిసవ్వడం.. తనను పట్టించుకోకపోవడం వల్ల సదురు మహిళ తిరిగి పుట్టింటికి వచ్చిందని పోలీసుల దర్యాప్తులో తేలింది.
అయితే ఆ మహిళ ఇటీవలే నెలలు నిండకుండా ఒక పసిబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డలో కొన్ని అనారోగ్య సమస్యలున్నట్లు అనుమానించింది. అయితే ఆ మహిళ తరచూ ఏడుస్తున్న బిడ్డకు పాలు ఇచ్చేందుకు నిరాకరించినట్టు నివేదిక తెలిపింది. నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డ కాబట్టి అనారోగ్యంగా ఉందనే నిరాశతో ఆ మహిళ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
సోమవారం ఉదయం వేడినీటిలో పడిన శిశువును చూసిన ఆ మహిళ తల్లిదండ్రులు కేకలు వేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వేడినీటిలో కాలిన గాయలతో ఉన్న పసిబిడ్డను గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శిశువుకు జన్మనిచ్చిన తల్లే ఈ దారుణానికి పాల్పిందని ఆమెను అరెస్ట్ చేశారు. భర్త దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని గుర్తించారు పోలీసులు. అందువల్లనే ఆమె దారుణానికి పాల్పడి ఉండవచ్చని వారు భావిస్తున్నారు.


