Crime : తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. ఒక మహిళ తన ప్రియుడి మోజులో పడి, భర్తతోపాటు తన 22 ఏళ్ల కూతురిని కూడా హత్య చేసింది. ఈ కేసును పోలీసులు చాలా చాకచక్యంగా ఛేదించి, నిందితులను అరెస్టు చేశారు. ఇది కేవలం ఒక సాధారణ హత్య కాదు, దీని వెనుక వివాహేతర సంబంధం, మోసం, క్షుద్ర పూజలు లాంటి ఎన్నో ట్విస్టులు ఉన్నాయి.
ALSO READ: Crime News:పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి..కుటుంబ కలహాలే కారణామా..!
ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పల కవిత (40)కు, అదే గ్రామానికి చెందిన జంజర్ల రాజ్‌కుమార్ (30)తో పరిచయం ఏర్పడింది. కవిత భర్త కప్పల కుమారస్వామి (50)కు ఐదేళ్ల క్రితం పక్షవాతం వచ్చి, ఇంటికే పరిమితమయ్యాడు. ఈ సమయంలో కవిత, రాజ్‌కుమార్ మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. భర్త ఈ విషయం గమనించి, భార్యను పలుమార్లు మందలించాడు. దీంతో వారికి భర్త అడ్డుగా కనిపించాడు.
గత జూన్ 25న, కూతురు ఇంట్లో లేని సమయంలో కవిత, రాజ్‌కుమార్ కలిసి కుమారస్వామిని గొంతు నులిపి చంపేశారు. అనారోగ్యంతో చనిపోయాడని బంధువులను నమ్మించి, అంత్యక్రియలు చేశారు. కానీ, పెద్ద కూతురు కప్పల వర్షిణి (22)కు తండ్రి మరణంపై అనుమానం వచ్చింది. ఆమె తల్లిని నిలదీసింది. దీంతో వర్షిణిని కూడా అడ్డు తొలగించాలని నిర్ణయించుకున్నారు.
ఆగస్టు 2 అర్ధరాత్రి, వర్షిణి నిద్రపోతుండగా గొంతు నులిపి హత్య చేశారు. మృతదేహాన్ని సంచిలో పెట్టి, ఒడితల శివారులోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలోని దుబ్బగట్టు గుట్ట పొదల్లో పడేశారు. ఎవరైనా చూస్తే అనుమానం వస్తుందని భావించి, ఆగస్టు 25న మళ్లీ శవాన్ని మరో సంచిలో తీసుకుని, ద్విచక్ర వాహనంపై కాటారం సమీపంలోని కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద పడేశారు.
ఇక్కడే ట్విస్ట్! పోలీసులను మోసం చేయడానికి, రాజ్‌కుమార్ సోషల్ మీడియా వీడియోలు చూసి క్షుద్ర పూజలు ఎలా చేయాలో నేర్చుకున్నాడు. శవం పక్కన నిమ్మకాయలు, పసుపు, కుంకుమ పూసి, నెయిల్స్ కొట్టి, క్షుద్ర పూజలు చేసినట్లు చిత్రీకరించాడు. ఇది చూసి పోలీసులు మొదట అనుమానాస్పద మరణంగా భావించారు.
ఆగస్టు 28న మృతదేహం లభ్యమైంది. ఆధార్ కార్డు ఆధారంగా వర్షిణిగా గుర్తించారు. ఆగస్టు 6న కవిత తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. గంగారం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, కవిత, రాజ్‌కుమార్ బైక్‌పై పారిపోతుండగా పట్టుకున్నారు. విచారణలో ఇద్దరూ నేరం అంగీకరించారు.
జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు, ఎస్సై ఆకుల శ్రీనివాస్ టీమ్ ఈ కేసును ఛేదించారు. నిందితులను రిమాండుకు తరలించారు. ఈ ఘటన ప్రజలను షాక్‌కు గురిచేసింది. వివాహేతర సంబంధాలు ఎంత ప్రమాదకరమో ఈ కేసు చూపిస్తోంది.


