Bihar police constable sexual harassment : నమ్మించి గొంతు కోశాడు. పెళ్లి పేరుతో వల వేసి, రెండేళ్ల పాటు నరకం చూపించాడు. సహోద్యోగి అనే కనికరం కూడా లేకుండా ఓ మహిళా కానిస్టేబుల్ జీవితంతో ఆడుకున్నాడు. ఈ దారుణ ఘటన బిహార్‌లో వెలుగుచూసింది, రక్షణ కల్పించాల్సిన పోలీసు శాఖలోనే ఈ అమానవీయ సంఘటన జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇంతకీ ఏం జరిగింది..? ఆ నమ్మకద్రోహం వెనుక ఉన్న కథేంటి..?
బాధిత మహిళ, బక్సార్ జిల్లాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. నిందితుడు కూడా గయా జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్. వీరిద్దరికీ 2023 ఫిబ్రవరిలో ఓ శిక్షణా శిబిరంలో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి మాటామంతీ పెరిగి, ఆమె ఫోన్ నంబర్ తీసుకుని తరచూ మాట్లాడేవాడు.
వారణాసిలో మొదటి అఘాయిత్యం: 2023 ఏప్రిల్‌లో బాధితురాలు వారణాసికి వెళ్లినప్పుడు, నిందితుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. ఒక హోటల్‌లో ఆమెపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో, ఉద్యోగం పోతుందని, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బతిమాలుకున్నాడు.
మోసపూరిత వివాహం, గర్భస్రావాలు : ఆ తర్వాత, 2023 మే నెలలో బాధితురాలు గర్భం దాల్చింది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు, నిందితుడు ఎవరికీ తెలియకుండా జార్ఖండ్‌లోని దేవ్‌గఢ్ ఆలయంలో ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే, పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లోనే తమ ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
తన కుటుంబాన్ని కలవాలని బాధితురాలు కోరినప్పుడల్లా, నిందితుడు ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేవాడు. తన కుటుంబాన్ని త్వరలోనే పరిచయం చేస్తానని నమ్మబలుకుతూ, ఆమెకు బలవంతంగా మందులు ఇచ్చి గర్భస్రావం చేయించాడు. ఇలా రెండేళ్ల వ్యవధిలో ఆమె మూడుసార్లు గర్భం దాల్చగా, ప్రతీసారీ ఏదో ఒక నెపంతో అబార్షన్ చేయించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
నిందితుడి మరో వివాహం, వెలుగులోకి వచ్చిన నిజం : అయితే, 2025 మేలో నిందితుడు మరో మహిళను వివాహం చేసుకున్న విషయం తెలియడంతో, తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
నిందితుడిపై వేటు, పరారీ : బాధితురాలి ఫిర్యాదు మేరకు డుమ్రాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో నమ్మించి లైంగిక వేధింపులకు పాల్పడినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.


