Boppudi fire accident : వ్యాపారాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలన్న ఆశ.. క్షణికావేశంలో చేసిన ఒక చిన్న పొరపాటు.. నిండు ప్రాణాన్ని బలిగొంది. చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఒక బాణసంచా దుకాణం క్షణాల వ్యవధిలోనే అగ్నిగుండంగా ఎలా మారింది? ఆ రీల్ సరదా చివరకు ఎలాంటి ఘోర విషాదానికి దారితీసింది?
వివరాల్లోకి వెళ్తే: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద జాతీయ రహదారి పక్కన భూమా సురేష్ (45) ‘కేఎస్ఎస్’ పేరిట బాణసంచా హోల్‌సేల్ దుకాణం నిర్వహిస్తున్నారు. దీపావళి పండుగ అమ్మకాల జోరు పెంచేందుకు ‘రీల్’ రూపంలో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలని ఆయన భావించారు. శుక్రవారం రాత్రి తన కుమారుడితో కలిసి దుకాణం ఎదుట టపాసులు కాల్పిస్తూ వీడియో చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
దురదృష్టవశాత్తూ, వారు వెలిగించిన ఓ బాణసంచా నిప్పురవ్వ ఎగిరి నేరుగా దుకాణంలో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలపై పడింది. క్షణాల్లో టపాసులన్నీ దడదడలాడుతూ పేలిపోవడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిశాయి. లోపల ఉన్న సురేష్ బయటకు రాలేక మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. వాచ్మెన్ యలగాల మస్తాన్‌రావుకు సైతం కాలిన గాయాలయ్యాయి.
చికిత్స పొందుతూ కన్నుమూత: సమాచారం అందిన వెంటనే రాత్రి 8:20 గంటలకు జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీధర్, చిలకలూరిపేట అగ్నిమాపక అధికారి అన్వేష్ కుమార్ రెడ్డి సిబ్బందితో చేరుకుని వాటర్ గన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. తీవ్ర గాయాలపాలైన సురేష్‌ను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరాలు ఆరా తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

