Brutal Murder: నల్గొండ జిల్లా అనుముల మండలంలో ఆదివారం ఉదయం ఘోర హత్యలు చోటుచేసుకున్నాయి. పొలం పనులకు వెళ్లిన తల్లీకూతుళ్లను దుండగులు అత్యంత అమానుషంగా హత్య చేశారు. మృతులను సుమలత, ఆమె కుమార్తె లావణ్యగా పోలీసులు గుర్తించారు.
ఆయిల్ పామ్ తోటలో దారుణం: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపేట గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు సుమలత, లావణ్యలు ఆదివారం ఉదయం స్థానికంగా ఉన్న ఒక ఆయిల్ పామ్ తోటలోకి పని కోసం వెళ్లారు. వీరిని ముందే గమనించి పొంచి ఉన్న దుండగులు ఒక్కసారిగా వారిపై దాడికి తెగబడ్డారు. బాధితులు ఎదురుతిరగకుండా ఉండేందుకు మొదట వారి కళ్లలో కారం చల్లి.. ఆపై అత్యంత దారుణంగా హతమార్చారు. తోటలో రక్తపు మడుగులో పడి ఉన్న తల్లీకూతుళ్ల మృతదేహాలను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు: ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే మిర్యాలగూడ రూరల్ పోలీసులు, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ఘటనతో ఇబ్రహీంపేట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also read-Crime: తల్లిని చంపి ముంబై డాన్ అవ్వాలనుకున్నాడు.. రాజాం హత్య కేసులో సంచలన విషయాలు!
భూతగాదాలే కారణమా?: పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. గత కొంతకాలంగా వీరి కుటుంబానికి కొందరితో నడుస్తున్న ఆస్తి వివాదాల నేపథ్యంలోనే ఈ జంట హత్యలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

