నవ మాసాలు మోసి, విద్యా బుద్దులు చెప్పించి ప్రయోజకుడిని చేయాలని తపన పడిన తల్లినే ఆస్తి కోసం హతమార్చాడు(Murder) కసాయి కొడుకు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని డివినో విల్లాస్లో జరిగింది.
మద్యానికి బానిసై ఆస్తి కోసం కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడేవాడు కార్తీక్ రెడ్డి (26). ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం తల్లి రాధిక (52)పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు కొడుకు కార్తీక్ రెడ్డి. కొడుకు చేతిలో కత్తిపోట్లకు గురైన రాధిక రక్తపు మడుగులో పడి ఉంది. ఆమెను కుటుంబీకులు హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావటంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ రాధిక మృతి చెందారు.
సమాచారం స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లిని కత్తితో పొడిచి చంపిన కార్తీక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.