Student abandons newborn in Chennai : “రోడ్డుపై దొరికింది సార్.. ఈ పసికందును మీరే కాపాడాలి!” అంటూ ఓ యువకుడు కర్రల సంచిలో పసిగుడ్డును పట్టుకుని ఆస్పత్రి మెట్లెక్కాడు. అతని మాటలు విని జాలిపడబోయిన సిబ్బందికి, అతని కళ్లలోని కంగారు పోలీసుల అనుమానానికి దారితీసింది. తీగ లాగితే డొంక కదిలినట్లు, పోలీసులు తమదైన శైలిలో విచారించగా, ఆ పసికందు కథ వెనుక కన్నీళ్లు పెట్టించే ప్రేమకథ, గుండెలు పిండేసే నిజం బయటపడింది. అసలేం జరిగింది..? హాస్టల్ గదిలో ఏం దాగి ఉంది..? ఆ నాటకీయ కథనం మీకోసం…
ఆస్పత్రిలో నాటకం.. పోలీసుల ఎంట్రీ: చెన్నైలోని ట్రిప్లికేన్ ప్రాంతంలో ఉన్న ఓమందూరార్ ప్రభుత్వ ఆసుపత్రికి శనివారం మధ్యాహ్నం, 21 ఏళ్ల యువకుడు ఒక కర్రల సంచిలో పసికందుతో వచ్చాడు. రోడ్డు పక్కన ఈ బిడ్డ దొరికిందని, మీరే కాపాడాలని ఆస్పత్రి సిబ్బందిని వేడుకున్నాడు. అయితే, అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటం, అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు గమనించారు. వారు ప్రశ్నించగా, యువకుడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం బలపడి, స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు.
విచారణలో వెలుగు చూసిన నిజం: పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి యువకుడు అసలు నిజం ఒప్పుకున్నాడు. అతని పేరు ప్రదీప్ (21) అని, ఊటీకి చెందినవాడని తేలింది. గ్రూప్-1 పరీక్షకు సిద్ధమయ్యేందుకు చెన్నైలోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో, గిండీ యూనివర్సిటీ హాస్టల్‌లో ఉంటూ ఎంఎస్సీ చదువుతున్న ఓ యువతితో అతనికి ప్రేమ సంబంధం ఏర్పడింది.
హాస్టల్ గదిలోనే రహస్య ప్రసవం: ఈ ప్రేమాయణం శారీరక సంబంధానికి దారితీయడంతో, యువతి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఇద్దరూ అత్యంత గోప్యంగా ఉంచారు. చివరకు, శుక్రవారం రోజున ఆ యువతి తాను ఉంటున్న హాస్టల్ గదిలోనే బిడ్డకు జన్మనిచ్చింది.
ఏం చేయాలో తెలియక.. దారుణ నిర్ణయం: లోకానికి భయపడి, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో, ఆ ప్రేమ జంట ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. పసికందును వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనితో, ప్రదీప్ ఆ పసిగుడ్డును ఒక కర్రల సంచిలో పెట్టుకుని, రోడ్డుపై దొరికిందనే నాటకమాడి ఆస్పత్రిలో అప్పగించేందుకు ప్రయత్నించాడు. కానీ అతని ప్రవర్తన.. పొంతన లేని సమాధానాలు పోలీసుల అనుమానానికి తావు ఇచ్చింది. అతనిని ఆ కోణంలో ప్రశ్నించగా.. అతని నాటకం ఫలించకుండానే పోలీసులు అసలు గుట్టు బట్టబయలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


