Attack on woman witchcraft suspicious: టెక్నాలజీ పుణ్యమా అని ఓ వైపు ఆకాశానికి నిచ్చెనలేస్తుంటే.. మరోవైపు మూఢ నమ్మకాలతో మనుషుల ప్రాణాలను తీస్తున్నారు. మంత్రాలు, చేతబడుల పేరుతో ఇటీవలి కాలంలో పలువురిపై దాడి చేయడంతో పాటు కొందరిని పొట్టనపెట్టుకున్న సంఘటనలూ చోటుచేసుకున్నాయి. తాజాగా బిహార్‌లో ఓ మహిళను దారుణంగా కొట్టి చంపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
బిహార్‌లో మూఢ నమ్మకాలు, పుకార్లు, ద్వేషం మరోసారి ప్రాణాంతకంగా మారాయి. ఓ చిన్నారి అనారోగ్యానికి గురి కావడంతో పాపపై చేతబడి చేస్తున్నారనే ఆరోపణలతో ఓ మహిళ(35)ను కొట్టి చంపారు. ఘటనలో మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. నవాడ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలో మూఢనమ్మకాలు.. అమాయకుల ప్రాణాలను ఎలా బలిగొంటున్నాయో ఈ సంఘటన అద్దం పడుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాడ జిల్లాకి చెందిన ముఖేష్ చౌదరి కూతురు అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు మెదడుకు సంబంధించిన వ్యాధి ఉందని గుర్తించారు. అయితే పాప అనారోగ్యానికి గురి కావడానికి కారణం పక్కింటి కిరణ్ దేవినే అంటూ ముఖేష్ చౌదరి కుటుంబీకులు ఆరోపించడం మొదలుపెట్టారు. ఆమెకు మంత్రాలు వచ్చని, దుష్ట ఆచారాలకు పాల్పడిదంటూ ఆమెను దుయ్యబట్టడం ఆరంభించారు. ఇది చిలికి చిలికి గాలి వానగా మారి చివరికి ఆమెపై దాడికి పాల్పడేలా చేసింది. కిరణ్ దేవితో పాటు ఆమె ఇద్దరు కోడళ్లపై ముఖేష్ కుటుంబీకులు ఇటుకలు, రాళ్లు, ఇనుప రాడ్లతో దాడి చేశారు.
స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే కిరణ్ దేవి మార్గ మధ్యలోనే మరణించింది. కాగా, మృతురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Also Read: https://teluguprabha.net/international-news/trump-to-meet-venezuelan-opposition-leader-machado/
అయితే, ఇరు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా వివాదం జరుగుతోందని నవాడి రాజౌలి పోలీస్ అధికారి రంజిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ వివాదం ఘర్షణకు దారితీసిందని తెలిపారు. ఇరు వర్గాలు ఐదుగురికి గాయాలయ్యాయని చెప్పారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగిస్తామని వివరించారు.
కాగా, జిల్లాలో ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. దాదాపు ఏడాది క్రితం, రాజౌలిలో ఓ మహిళపై మంత్రగత్తెగా ముద్ర వేసి ఆమెను సజీవ దహనం చేశారు. గతేడాది నవాడలోని హిసువా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చేతబడి నెపంతో దంపతులపై దాడి చేశారు. ఘటనలో భర్త మరణించగా.. భార్య గాయాలతో బయటపడింది.

